Modi-Biden bilateral meet: ద్వైపాక్షిక సమావేశంలో మోదీ, బైడెన్ చర్చించిన అంశాలు ఇవే..
జీ20 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్- ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఇరువురు దేశాధినేతలు కీలక అంశాలపై చర్చించారు. మోదీ- బైడెన్ చర్చల తరువాత సంయుక్త ప్రకటన విడుదల చేశారు. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంలో తమ నిబద్ధతను ఆ ప్రకటనలో మరోసారి పునరుద్ఘాటించారు. ఆ ప్రకటనలో ఏముందో ఒకసారి తెలుసుకుందాం. రెండు నెలల క్రితం ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాలను అమలు చేయడంలో గణనీయమైన పురోగతి సాధించినట్లు ఇరువురు దేశాధినేతలు ప్రకటించారు. జీ20 కూటమికి భారత్ అధ్యక్షత వహించడంపై బైడెన్ ప్రశంసించారు.
యూఎన్ భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి బైడెన్ మద్దతు
2024లో క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ, వాణిజ్య కనెక్టివిటీ, సముద్ర రవాణాపై ఓషన్స్ ఇనిషియేటివ్ ప్రోత్సహించడంలో క్వాడ్ ప్రాముఖ్యతను మోదీ, బైడన్ గుర్తించారు. యూఎన్ భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి బైడెన్ తన మద్దతును పునరుద్ఘాటించారు. 2028-29లో యూఎన్ఎసీ నాన్-పర్మనెంట్ సీటుకు భారతదేశ అభ్యర్థిత్వాన్నిబైడెన్ స్వాగతించారు. భారత్- అమరికా మధ్య సాంకేతిక భాగస్వామ్యంపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ క్రమంలో ఇరు దేశాలు ఒప్పదం చేసుకున్న భారత్-యూఎస్ ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ(ఐసీఈటీ)ని ప్రశ్నించారు.
భారత అంతరిక్ష పరిశోధనలపై బైడన్ ప్రశంసలు
చంద్రయాన్-3 విజయవంతం నేపథ్యంలో అంతరిక్ష పరిశోధనలో భారత్ సాధించిన విజయాలపై బైడెన్ ప్రశంసల వర్షం కురింపించారు. అంతరిక్ష పరిశోధన, గ్రహాల రక్షణలో ఉమ్మడి ప్రయత్నాల కోసం చర్చలు జరుగుతున్నట్లు ఇద్దరు నేతలు చెప్పారు. భారతదేశంలోని మైక్రోచిప్ టెక్నాలజీ ఇంక్., అడ్వాన్స్‌డ్ మైక్రో డివైసెస్ నుంచి మిలియన్ డాలర్ల పెట్టుబడులను బైడెన్-మోదీ స్వాగతించారు. అలాగే బలమైన గ్లోబల్ సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థను సృష్టించేందుకు ఇరువురు నేతలు పరస్పరం మద్దతును తెలుపుకున్నారు. భారత్ 6జీ అలయన్స్, నెక్స్ట్ జీ అలయన్స్ మధ్య అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా సురక్షితమైన కమ్యూనికేషన్, డిజిటల్ ఒప్పందాలపై ఆసక్తిని కనబర్చారు.
ఏఐ, స్పేస్, రక్షణ రంగంలో మరింత సహకారం
ఏఐ, స్పేస్‌తో సహా అభివృద్ధి చెందుతున్న డొమైన్‌లలో సహకారాన్ని మోదీ-బైడెన్ అంగీకరించారు. అలాగే భారత్-యూఎస్ మధ్య రక్షణ రంగంలో సాంకేతిక సహకారం గణనీయమైన అభివృద్ధిని సాధించింది. తాజాగా జీఈ ఏరోస్పేస్, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ మధ్య ఉత్పత్తి, సాంకేతిక బదిలీతో ఈ సహకారం తయారీ రంగానికి కూడా విస్తరించింది. స్పేస్, ఏఐ వంటి అభివృద్ధి చెందుతున్న డొమైన్‌లతో సహా రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలపర్చుకోవాలని బైడెన్, మోదీ ప్రతిజ్ఞ చేశారు. అణుశక్తి ఆవశ్యకతపై మోదీ, బైడెన్ చర్చించారు. వాతావరణ లక్ష్యాలను చేరుకోవడానికి సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణియించారు. సురక్షితమైన ఇంధన సహకారంపై ఇరువు నేతలు ఒక అవగాహనకు వచ్చారు.