
Bhu Bharati Act Passbook: భూ భారతి చట్టం ప్రకారం భూమి యజమానులకు పాస్‌బుక్ పొందే విధానం, ఫీజు వివరాలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌ను రద్దు చేసి, దాని స్థానంలో భూ భారతి చట్టాన్ని అమలులోకి తెచ్చింది.
ఈ మేరకు కొత్తగా రూపొందించిన భూ భారతి పోర్టల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నాడు శిల్పకళా వేదికలో లాంచ్ చేశారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ధరణిని రద్దు చేసి, భూముల పరిరక్షణ కోసం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చినట్లు సీఎం ప్రకటించారు.
వివరాలు
పాస్‌బుక్ పొందేందుకు దరఖాస్తు ఎలా చేయాలి?
భూ భారతి చట్టం ప్రకారం, భూమి యజమాని ₹300/- ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.
ఆ తర్వాత అధికారుల ద్వారా పట్టాదారు పాస్‌బుక్ జారీ చేయబడుతుంది. అయితే, ఇది పొందేందుకు ముందుగా భూమి వివరాలు భూ రికార్డుల్లో నమోదై ఉండాలి.
ఆ తర్వాత లైసెన్స్డ్ సర్వేయర్ ద్వారా భూమి సర్వే చేయించుకుని, భూమి మ్యాప్ తయారు చేయించుకోవాలి.
మండల సర్వేయర్ ఆ మ్యాప్‌ను ధృవీకరిస్తే, అదే మ్యాప్‌ను పాస్‌బుక్‌లో నమోదు చేస్తారు.
పాస్‌బుక్‌లో ఏవైనా తప్పులుంటే, దానికి సంబంధించి దరఖాస్తు చేసుకుంటే ఎమ్మార్వో (MRO)ఆ వివరాలను పరిశీలించి సరి చేస్తారు.
ఎమ్మార్వో తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం ఉంటే ముందుగా ఆర్డీవో (RDO)కు,తర్వాత జిల్లా కలెక్టర్ వద్దకు అప్పీల్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
వివరాలు
ప్రభుత్వ భూములపై అక్రమ పట్టాల రద్దుకు అవకాశం
రాష్ట్రంలోని ఎక్కడైనా ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, భూదాన్ వంటి భూములపై ఎవరికైనా అక్రమంగా పట్టాలు జారీ అయితే, వాటిని రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్కు ఫిర్యాదు చేయవచ్చని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
భూ భారతి చట్టంలోని సెక్షన్ 16, నిబంధన 15 ప్రకారం ఇటువంటి ఫిర్యాదులకు అవకాశం ఉంది.
గతంలో అమలు చేసిన ధరణిలో ఇలాంటి నిబంధనలు లేకపోయాయని సీఎం పేర్కొన్నారు.
ఇకపై ప్రతి భూమికి భూధార్ కార్డు జారీ చేస్తామని, ఇది మనిషికి ఆధార్ కార్డులాగే పనిచేస్తుందని తెలిపారు.
వివరాలు
గ్రామ రెవెన్యూ రికార్డుల భద్రత - న్యాయ సహాయం
ధరణి చట్టంలో గ్రామ రెవెన్యూ రికార్డులను నమోదు చేసుకునే అవకాశం లేకపోవడంతో, భూ భారతి చట్టంలో సెక్షన్ 13, నిబంధన 12 ద్వారా ఈ లోపాన్ని సవరించారు.
ప్రతి ఏడాది డిసెంబర్ 31న గ్రామ రెవెన్యూ రికార్డులు ముద్రించి ప్రత్యేకంగా భద్రపరచబడతాయి.
ధరణి అమలులోకి వచ్చిన తర్వాత గ్రామ పహానీలు నిర్వహణలో లేవు.
కానీ భూ భారతి చట్టం ద్వారా ప్రభుత్వ భూములు, పహాని,నీటి వనరుల భూముల రికార్డులను ప్రభుత్వం నిర్వహిస్తుంది.
అంతేకాదు,సెక్షన్ 15 (8), నిబంధన 16 ప్రకారం మహిళలు,ఎస్సీ,ఎస్టీ వర్గాలకు ఉచిత న్యాయ సహాయం కూడా అందించనున్నారు.
న్యాయ సేవా సంస్థలు,ఇతర సహాయక సంస్థల సహకారంతో న్యాయ సలహాలు, సహాయాన్ని కల్పించే విధంగా తెలంగాణ ఈ నిబంధనను చట్టబద్ధం చేసింది.
వివరాలు
సాదా బైనామాల క్రమబద్ధీకరణ
ఇది ధరణి చట్టంలో లేనిది అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ధరణిలో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు సంబంధించి ఎలాంటి నిబంధనలు లేకపోవడం వల్ల హైకోర్టు స్టే విధించింది.
కానీ భూ భారతి చట్టంలోని సెక్షన్ 6, నిబంధన 6 ప్రకారం,సాదా బైనామాలను నిర్దిష్ట షరతులతో రెగ్యులరైజ్ చేస్తారు.
అయితే,వాటిలో ఎలాంటి చట్ట ఉల్లంఘన లేనట్లు నిర్ధారణ అయిన తరువాత మాత్రమే ఇది సాధ్యం అవుతుంది.
రెగ్యులరైజేషన్ కోసం స్టాంపు, రిజిస్ట్రేషన్ ఛార్జ్, అలాగే ₹100 జరిమానా వసూలు చేసి డాక్యుమెంట్ జారీ చేయబడుతుంది.
ఆ తర్వాత ఆ వివరాలను భూ రికార్డుల్లో నమోదు చేసి, సంబంధిత భూమి యజమానికి పాస్‌బుక్ జారీ చేస్తారు అని అధికారులు తెలిపారు.