Ration Cards: కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పుడో..? ప్రజల్లో పెరుగుతున్న అయోమయం!
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో మార్చి 1 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినా ఇప్పటికీ అమల్లోకి రాలేదు.
పైగా ప్రభుత్వ ప్రకటనల్లో స్పష్టత లేకపోవడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.
హైదరాబాద్ జిల్లాలో దరఖాస్తుల పరిశీలన ఆలస్యమైందని చెబుతుండగా, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల్, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీ ఎందుకు జరగలేదన్న ప్రశ్నలు వెలువడుతున్నాయి.
Details
రేషన్ కార్డుల కోసం లక్షలాదిమంది దరఖాస్తులు
హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మార్చి 1 నుంచి రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటించినా ఇప్పటికే మూడు రోజులు గడిచినా ఇంకా పంపిణీపై ఎటువంటి సమాచారం లేదు.
దీనిపై పౌరసరఫరాల శాఖ అధికారులను సంప్రదించగా, ప్రభుత్వంచే ఎలాంటి ఆదేశాలు తమకు అందలేదని తెలిపారు.
హైదరాబాద్ కోర్ సిటీ పరిధిలోని తొమ్మిది సర్కిళ్లలో ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 6,39,451 రేషన్ కార్డులు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రజాపాలన కార్యక్రమంలో 5.40 లక్షల మంది, కుల గణన సర్వేలో 83 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.
Details
సీఎం ఆదేశించినా ఇప్పటికీ ప్రారంభం కాలేదు
తాజాగా మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని అధికారుల ప్రకటన నేపథ్యంలో మరింత మంది దరఖాస్తు చేసుకున్నారు.
కేవలం రెండు వారాల్లోనే 1,31,484 మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేశారు.
ప్రత్యేకంగా చిప్ ఉండే ఏటీఎం కార్డు తరహాలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం ప్రారంభంలో యోచించినా ఏ విధంగా అమలు చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
చివరకు సాధారణ పద్ధతిలోనే కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినా ఇప్పటికీ పంపిణీ ప్రారంభం కాలేదు.
Details
కుల గణన సర్వేలో అర్హుల జాబితా అందలేదు
రేషన్ కార్డుల జారీ ఆలస్యంపై పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారి ప్రకటన చేశారు.
నాలుగు నెలల కిందట గ్రేటర్ పరిధిలో నిర్వహించిన కుల గణన సర్వేలో అర్హుల జాబితా ఇంకా అందలేదని, తాజాగా మీసేవ ద్వారా స్వీకరిస్తున్న దరఖాస్తుల వివరాలు కూడా పూర్తిగా అందలేదని వెల్లడించారు.
ఈ దరఖాస్తులు అందిన తర్వాత ఇంటింటి సర్వే నిర్వహించి అర్హులను గుర్తిస్తామని స్పష్టం చేశారు.