Ravi Sankar Prasad: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పాత పెన్షన్ పథకం ఎందుకు లేదు?.. బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్
యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(యూపీఎస్)ను అమలు చేస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే దీనిపై కాంగ్రెస్ ఛీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు. బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకుంటుందన్నారు. యూపీఎస్‌లో 'యూ' అంటే యూనిఫైడ్ కాదని, 'యూటర్న్' అని వ్యాఖ్యనించారు. ఈ విమర్శలపై బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజల ప్రయోజనాలను నిశితంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయింది
హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒపిఎస్ అమలు చేస్తామని ఎన్నికల హామీపై కాంగ్రెస్ ఎందుకు "యూ-టర్న్" తీసుకుందని ఖర్గేను రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. ఓట్ల కోసం తప్పుడు వాగ్దానాలు చేస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రజలను మభ్యపెడుతున్నారని, ఇలాంటి పద్ధతులను మానుకోవాలని ఆయన సూచించారు. హిమాచల్ ప్రదేశ్‌లో రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లుగా పాత పెన్షన్ పథకాన్ని అమలు చేశారా అని నిలదీశారు. దీనిని ఎప్పుడు నెరవేరుస్తారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రాహుల్ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలపై ప్రజలకు నమ్మకం పోయిందని ఆయన ఆరోపించారు.