Page Loader
Adampur Airbase: పాక్‌ తాటాకు చప్పుళ్లకు బెదరకుండా.. గర్వంగా నిలబడిన ఆదంపుర్‌ ఎయిర్‌ బేస్‌.. 

Adampur Airbase: పాక్‌ తాటాకు చప్పుళ్లకు బెదరకుండా.. గర్వంగా నిలబడిన ఆదంపుర్‌ ఎయిర్‌ బేస్‌.. 

వ్రాసిన వారు Sirish Praharaju
May 15, 2025
01:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌ సైనిక కేంద్రానికి అతి సమీపంలో ఉన్న నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌పై భారత్‌ దిమ్మతిరేగే దెబ్బకొట్టింది. దానికి ప్రతిగా భారత్‌లోని ఆదంపుర్‌ ఎయిర్‌బేస్‌పై దాడి చేశామంటూ పాకిస్థాన్‌ తప్పుడు ప్రచారం ప్రారంభించింది. ముఖ్యంగా ఎస్‌-400 పై దాడి చేశామంటూ అవాస్తవాలను ప్రచారం చేసింది. ఈ వాదనలను తప్పుబట్టేలా భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆదంపుర్‌ ఎయిర్‌బేస్‌ను సందర్శించి, అక్కడ ఉన్న ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థ, మిగ్‌-29 యుద్ధ విమానాలు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయంటూ ప్రపంచానికి నిరూపించారు. వ్యూహాత్మకంగా ఈ ఎయిర్‌బేస్‌కు అత్యంత ప్రాముఖ్యత ఉంది. భారత్‌-పాక్‌ మధ్య జరిగిన ప్రతి యుద్ధంలో ఇది మొదటి లక్ష్యంగా మారినప్పటికీ, శత్రుదాడుల్ని తట్టుకొని నిలబడిన గౌరవం ఈ స్థావరానిది.

వివరాలు 

ఆదంపుర్‌ ప్రాముఖ్యత ఏమిటి? 

1950ల కాలంలో ఆదంపుర్‌ ఎయిర్‌బేస్‌ స్థాపించారు. ఇది పంజాబ్‌లోని జలంధర్‌ నగరానికి సమీపంలో ఉంది. పాకిస్థాన్‌ సరిహద్దు కేవలం 100 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో ఇది వ్యూహపరంగా చాలా కీలకంగా మారింది. ఇది దేశంలో రెండవ అతిపెద్ద వాయుసేన స్థావరం కావడం విశేషం. గత 75 సంవత్సరాలుగా పాక్‌ రాడార్‌ పరిధిలో ఉన్నా, ఎన్నో రిస్కులను ఎదుర్కొంటూ సత్తాచాటింది. పాక్‌ తరచూ ఈ స్థావర భద్రత వ్యవస్థను ఛేదించేందుకు ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఈ నెల 9, 10 తేదీల్లో పాకిస్థాన్‌ దాదాపు 6 క్షిపణులను ప్రయోగించగా, వాటిని భారత సైన్యం సుమారు 7 కిలోమీటర్ల దూరంలోనే నాశనం చేసింది.

వివరాలు 

బ్లాక్‌ ఆర్చర్స్‌కు కేంద్ర బిందువు 

ఆదంపుర్‌ ఎయిర్‌బేస్‌ భారత వాయుసేన 47వస్క్వాడ్రన్‌కు నివాస కేంద్రం.దీనిని 'బ్లాక్‌ ఆర్చర్స్‌'గా పిలుస్తారు. అలాగే 'ఫస్ట్‌ సూపర్‌సోనిక్స్‌'గా గుర్తింపు పొందిన 28వ స్క్వాడ్రన్‌ కూడా ఇక్కడే ఆధారంగా ఉంది.ఈ రెండు యూనిట్లు ఎయిర్‌బేస్‌ యొక్క నిత్య కార్యకలాపాలకు కీలక పాత్ర పోషిస్తున్నాయి. భౌగోళికంగా కీలక స్థానం.. ఆదంపుర్‌ చుట్టూ 150 కిలోమీటర్ల పరిధిలో పలు కీలక ఎయిర్‌బేస్‌లు ఉన్నాయి.పఠాన్‌కోట్‌లో ఆపాచీ హెలికాప్టర్లు,హల్వారలో సుఖోయ్‌-30 ఎంకేఐ,అమృత్‌సర్‌లో పాక్‌ సరిహద్దు సమీపం,బఠిండాలో రఫేల్‌ జెట్లు,ఛండీఘడ్‌లో మరో వైమానిక స్థావరం ఉన్నాయి. వీటన్నింటిని ఒక గ్రిడ్‌ లా కలుపుతూ ఆదంపుర్‌ కేంద్రబిందువుగా వ్యవహరిస్తోంది.ఇదే కారణంగా ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థను మొదటగా ఇక్కడే మోహరించారు. దీనివలన పశ్చిమ సరిహద్దులన్నీ ఈ రక్షణ వ్యవస్థ పరిధిలోకి వచ్చాయి.

వివరాలు 

యుద్ధాల్లో ఆదంపుర్‌ పాత్ర 

1965లో పాకిస్థాన్‌ వాయుసేన ఆదంపుర్‌ పై ముందస్తు దాడికి దిగింది. తర్వాత 135 మంది పాకిస్తాన్‌ ప్రత్యేక దళాలను ఎయిర్‌ డ్రాప్‌ చేసి భారత్‌లో చొరబడేందుకు ప్రయత్నించింది. అయితే, అక్కడి గ్రామస్తులు చాలామందిని పట్టుకుని భారత సైన్యానికి అప్పగించారు. మిగతా వారు తిరిగి పాక్‌కు పారిపోయారు. అప్పట్లో ఈ స్థావరంలో ఉన్న 1వ స్క్వాడ్రన్‌ పాక్‌లోని సర్గోధా వంటి కీలక స్థావరాలపై ఎదురు దాడులు జరిపి వాటిని ధ్వంసం చేసింది. 1971లో జరిగిన యుద్ధ సమయంలో, పాక్‌ పఠాన్‌కోట్‌ రన్‌వేను ధ్వంసం చేసినప్పుడు, ఆదంపుర్‌ నుంచే యుద్ధ విమానాలు గాల్లోకి ఎగిరి రక్షణ కల్పించాయి.

వివరాలు 

టైగర్‌ హిల్స్‌, టోలోలింగ్‌ శిఖరాల స్వాధీనంలో కీలక పాత్ర

ఈ యుద్ధమంతా ఆదంపుర్‌ తన పూర్తి సామర్థ్యంతో పనిచేసింది. 1999 కార్గిల్‌ యుద్ధంలోనూ ఆదంపుర్‌ నుండి మిరాజ్‌ 2000 యుద్ధ విమానాలు బయలుదేరి, శత్రువు ఏర్పాటు చేసిన బంకర్లను ధ్వంసం చేశాయి. ప్రత్యేకంగా టైగర్‌ హిల్స్‌, టోలోలింగ్‌ శిఖరాల స్వాధీనంలో కీలక పాత్ర పోషించింది. ఆదంపుర్‌ ఎయిర్‌బేస్‌ భారత్‌ రక్షణ వ్యవస్థలో అత్యంత కీలక స్థావరంగా నిలిచింది. చరిత్రలో ఎన్నో యుద్ధాలను ఎదుర్కొని, శత్రు దాడుల నుంచి దేశాన్ని కాపాడిన ఈ స్థావరం, భవిష్యత్తులోను అదే స్థాయిలో వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.