Page Loader
Couple Missing: హనీమూన్‌ జంట కేసులో బిగ్‌ ట్విస్ట్.. భార్య సహా నలుగురు హంతకులు అరెస్ట్
హనీమూన్‌ జంట కేసులో బిగ్‌ ట్విస్ట్.. భార్య సహా నలుగురు హంతకులు అరెస్ట్

Couple Missing: హనీమూన్‌ జంట కేసులో బిగ్‌ ట్విస్ట్.. భార్య సహా నలుగురు హంతకులు అరెస్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2025
08:58 am

ఈ వార్తాకథనం ఏంటి

మేఘాలయలో హనీమూన్ కోసం వెళ్లిన ఇండోర్ జంట అదృశ్యమైన కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. మధ్యప్రదేశ్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్ అనే దంపతులు మే నెలలో తమ వివాహానంతరం విహారయాత్రకు వెళ్లగా, వారిలో భర్త మృతదేహంగా బయటపడిన సంగతి తెలిసిందే. కాగా, కన్పించకుండా పోయిన భార్య సోనమ్‌ను పోలీసులు తాజాగా గుర్తించారు. ఆమెతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, సోనమ్ తన భర్తను హత్య చేయించేందుకు కాంట్రాక్ట్ కిల్లర్లకు సుపారీ ఇచ్చినట్లు తేలింది.

వివరాలు 

మే 20న హనీమూన్ 

రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం నిర్వహిస్తోంది. మే 11న రాజా రఘువంశీ,సోనమ్ వివాహం జరిగింది.అనంతరం మే 20న వీరు హనీమూన్ కోసం మేఘాలయ బయలుదేరారు. మే 22న వీరు ఓ ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకుని మౌలాకియాత్ అనే గ్రామానికి చేరుకున్నారు. అక్కడి ప్రసిద్ధ లివింగ్ రూట్ బ్రిడ్జ్‌ చూడటానికి వెళ్లినట్లు మేఘాలయ అధికారులు వెల్లడించారు. అయితే ఆ తర్వాత వీరి ఆచూకీ గల్లంతయ్యింది. 11 రోజుల అనంతరం,రాజా రఘువంశీ మృతదేహం మేఘాలయలోని సోహ్రా ప్రాంతంలో ఉన్న ఓ జలపాతం సమీపంలోని లోతైన లోయలో గుర్తించారు. మృతదేహంపై గాయాల గుర్తులు ఉండటంతో పోలీసులు హత్య అనుమానంతో దర్యాప్తు మొదలుపెట్టారు.

వివరాలు 

ఘటనపై స్పందించిన మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా

భార్య సోనమ్ ఆచూకీ కోసం గాలింపు చేపట్టగా, ఆమె ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజీపుర్‌లో లొంగిపోయింది. ఆపై ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు మేఘాలయ డీజీపీ సోమవారం వెల్లడించారు. ఆమెతో పాటు ఈ హత్యకు సహకరించిన మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. రఘువంశీని చంపేందుకు అతడి భార్య సోనమ్‌ తమకు సుపారీ ఇచ్చినట్లు నిందితులు విచారణలో వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే దిశగా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా స్పందించారు. కేసును కేవలం ఏడు రోజుల్లోనే ఛేదించిన పోలీసులకు అభినందనలు తెలిపారు. హత్య కేసులో మరింతమంది నిందితులు ఉండి ఉంటారని, వారిని పట్టుకునేందుకు పోలీసుల ఆపరేషన్‌ కొనసాగుతోందని సీఎం వెల్లడించారు.