రూ. 160కోట్ల ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేసిన భారత మాజీ అటార్నీ జనరల్ భార్య
భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ భార్య వసుధ రోహత్గీ దిల్లీలోనే ఖరీదైన ప్రాంతంలో విలాసవంతమైన బంగ్లాను కొనుగోలు చేశారు. బంగ్లా ఖరీదు అక్షరాల రూ.160 కోట్లు అని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. దిల్లీలోనే అత్యంత ఖరీదైన ప్రాంతమైన గోల్ఫ్ లింక్స్‌లో 2,100 చదరపు గజాలతో ఈ విలాసవంతమైన బంగ్లా ఉంది. ఫిబ్రవరి 23న బంగ్లా రిజిస్ట్రేషన్ పూర్తయిందని, దీన్ని కొనుగోలు చేసినందుకే ముకుల్ రోహత్గీ కుటుంబం కేవలం స్టాంప్ డ్యూటీనే రూ.6.4 కోట్ల చెల్లించిందని ఎకనామిక్ టైమ్స్ నివేదిక పేర్కొంది. దిల్లీలోని గోల్ఫ్ లింక్స్ ప్రదేశంలో పరిమితంగా కొనుగోళ్లు అమ్మకాలు జరుగుతుంటాయి. దీన్ని చాలా లగ్జరీ ప్రదేశంగా భావిస్తుంటారు. అందుకే ఈ ప్రదేశంలో కొనుగోళ్లు, అమ్మకాలు రూ.100కోట్లకు పైనే జరుగుతుంటాయి.
బంగ్లా కొనుగోలుపై స్పందించేందుకు నిరాకరించిన ముకుల్ రోహత్గీ
రోహత్గీ దంపతులు ఈ ఖరీదైన ప్రాపర్టీని కొనుగోలు చేయడం ద్వారా, దిల్లీలోని బడా పెట్టుబడిదారులు, కార్పొరేట్ల సరసన చేరినట్లు అవుతుందని ఎకనామిక్ టైమ్స్ వెల్లడించింది. గోల్ఫ్ లింక్స్‌లో బంగ్లా కొనుగోలుపై రోహత్గీని సంప్రదించగా, ఆయన దీనిపై మాట్లాడేందుకు నిరాకరించిటన్లు ఎకనామిక్ టైమ్స్ చెప్పింది. గత ఏడాది, భారత మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రమణియం కూడా దిల్లీలోని లుటియన్స్ సుందర్ నగర్‌లో 866 చదరపు గజాల విస్తీర్ణంలో రూ.85 కోట్ల రూపాయలతో విశాలమైన బంగ్లాను కొనుగోలు చేశారు. నాన్ కార్పొరేట్ వ్యక్తి ఇంత మొత్తం ఎలా కొన్నారా అని ఆ సమయంలోనే అంతా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు రోహత్గీ దానికి రెండు రెట్ల మొత్తం చెల్లించి బంగ్లాను కొనుగోలు చేయడం మరింత ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.