LOADING...
#NewsBytesExplainer: వైసీపీ నేతల అరెస్టులపై ఢిల్లీకి వెళ్లే యోచనలో జగన్.. మద్దతు తెలిపే వారితో సంప్రదింపులు.. స్పందన లేకపోవచ్చనే అనుమానాలు!
మద్దతు తెలిపే వారితో సంప్రదింపులు.. స్పందన లేకపోవచ్చనే అనుమానాలు!

#NewsBytesExplainer: వైసీపీ నేతల అరెస్టులపై ఢిల్లీకి వెళ్లే యోచనలో జగన్.. మద్దతు తెలిపే వారితో సంప్రదింపులు.. స్పందన లేకపోవచ్చనే అనుమానాలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 24, 2025
05:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వ్యవస్థ మొత్తం కేసుల సునామీలో చిక్కుకుంది. లిక్కర్ స్కాం అత్యంత తీవ్ర రాజకీయ అంశంగా మారింది.ఈ వ్యవహారంలో వైఎస్ఆర్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. మరోవైపు, క్వార్ట్జ్ గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో ఒక మాజీ మంత్రి జైలులో ఉండగా,మరొక మాజీ మంత్రిపై ఆరోపణలు వెలువడుతున్నాయి. చాలా మంది నేతలు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూ అందుబాటులో లేకుండా పోతున్నారు. చివరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్టు జరిగే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

వివరాలు 

రాజకీయ మద్దతు కోసం సంప్రదింపులు ప్రారంభించిన జగన్ 

ఈ పరిణామాల నేపథ్యంలో, ఈ కేసుల అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లి ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని అందరికీ చెప్పాలని జగన్ అనుకుంటున్నారు. ఆయన త్వరలో ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో ఉన్నారని, పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. జగన్ ఢిల్లీ వెళ్లి అక్కడ ధర్నా చేయాలన్నది ఒక ఆలోచన. మరోవైపు, వివిధ రాజకీయ పార్టీల నేతలను కలిసి, లిక్కర్ స్కాంలో తాము నిర్దోషులమని, కేంద్ర పాలన ఆధీనంలో రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధంగా కార్యకలాపాలు జరుగుతున్నాయని వివరించాలనుకుంటున్నారు. ఈ విధంగా ఏపీలోని పరిస్థితులను జాతీయ దృష్టిలోకి తీసుకువెళ్తే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఇందుకోసం గతంలో బెంగళూరు నుంచే తమకు మద్దతు తెలిపిన విపక్ష నేతలతో ఆయన సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు సమాచారం.

వివరాలు 

గతంలో మద్దతుగా నిలిచిన ఇండీ కూటమి పార్టీలు 

సాధారణంగా ప్రతి వారం బెంగళూరులో ఉండే వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు ఈ వారం తాడేపల్లికి రాకపోవడం ఈ అంశానికి సంబంధించిన పర్యటన ఏర్పాట్లలోనే ఉందనే భావనను కలిగిస్తోంది. వైసీపీ నేతలను హత్యలు చేస్తున్నారని జగన్ గతంలో ఢిల్లీలో ధర్నా చేశారు. ఇండీ కూటమిలోని పార్టీలను ఆహ్వానించి చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించేలా చేసి వారి మద్దతు పొందారు. ఆ సమయంలో శివసేనతో పాటు ఇతర పార్టీలు కూడా ఆ ధర్నాకు హాజరయ్యాయి. ఇప్పుడు కూడా అదే తరహాలో మద్దతు పొందాలని జగన్ ఆశిస్తున్నారు. పార్టీలు ఢిల్లీ వచ్చి తనకు మద్దతు ప్రకటించేలా చూడాలనుకుంటున్నారు. ఈ విధంగా జాతీయ మీడియా దృష్టిని రాష్ట్రం వైపుకు మళ్లించాలన్నది జగన్ లక్ష్యం.

వివరాలు 

ఈ సారి మద్దతు దక్కుతుందా?  

అయితే ఈసారి గతంలాగే ఢిల్లీలో కొన్ని పార్టీల మద్దతు లభించడం కూడా కష్టంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. . ఎందుకంటే గతంలో ఇండీ కూటమి పార్టీలు జగన్‌కు మద్దతు తెలిపినా, ఆయన తరువాత సమయాల్లో ఎన్డీఏకి అనుకూలంగా వ్యవహరించారని విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో, ఇప్పుడు అదే పార్టీల మద్దతు తిరిగి లభించకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఎన్డీఏలోని పార్టీల నుంచి మద్దతు రావడం అసాధ్యమే అన్నది మరో స్పష్టత.

వివరాలు 

జగన్‌పై నేరుగా విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌  

ఇక కాంగ్రెస్ పార్టీ విషయంలోనూ జగన్‌కు అనుకూల వాతావరణం కనిపించట్లేదు. ఏపీ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ఆయనపై నేరుగా భారీ స్కామ్ చేశారని ఆరోపించగా, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా అదే దిశగా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో,ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ నుంచి కూడా జగన్‌కు సహకారం దొరకడం కష్టమే అని స్పష్టమవుతోంది. మొత్తంగా చెప్పాలంటే,జగన్ ఢిల్లీ పర్యటన ద్వారా ఏపీ రాజకీయ సమస్యలను జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న ప్రయత్నం చేస్తున్నా,గత రాజకీయ ప్రవర్తనల నేపథ్యంలో ఆయనకు మద్దతు లభించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. పాత మిత్రపక్షాలు,ప్రస్తుత విపక్షాలు కూడా దూరంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జగన్ ఢిల్లీ పర్యటన ఫలితం ఏ మేరకు ఉంటుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.