R. Krishnaiah: బీజేపీలోకి వైసీపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య..?
వైసీపీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్. కృష్ణయ్య త్వరలో కాషాయ కండువా కప్పుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. బీజేపీ వర్గాలు కూడా ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ధ్రువీకరించే అవకాశం ఉంది. ముఖ్యంగా బీసీ ఓటు బ్యాంకును పెంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత కృష్ణయ్యను పార్టీలోకి చేర్చుకుంటే బీసీలు బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ మేరకు ఆర్. కృష్ణయ్యతో పార్టీ జాతీయ అగ్రనేత ఒకరు నేరుగా చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ ఆఫర్‌కు ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
గతంలో ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన కృష్ణయ్య
త్వరలో కృష్ణయ్యకు బీజేపీలో కీలక పదవి అప్పగించనున్నారని బీజేపీ వర్గాలు తెలుపుతున్నాయి. గతంలో ఆర్.కృష్ణయ్య రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో క్రియాశీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఏబీవీపీతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నందున ఆర్‌ఎస్‌ఎస్ కూడా కృష్ణయ్యను బీజేపీలోకి తీసుకురావడం కోసం చర్చలు జరుపుతోంది. కృష్ణయ్య 2014లో టీడీపీ తరపున ఎల్బీ నగర్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలో టీడీపీ ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది.
గత ఎన్నికల్లో 'బీసీ సీఎం' తో ముందుకెళ్లిన బీజేపీ
అనంతరం 2022లో వైసీపీ ఆయనకు రాజ్యసభ టికెట్ ఇచ్చింది. ప్రస్తుతం ఆయన వైసీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆర్.కృష్ణయ్య పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం ద్వారా రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఎన్నికల్లో బీజేపీ 'బీసీ సీఎం' నినాదంతో ముందుకు వెళ్లి, బీసీ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆ వ్యూహాన్ని మరింత బలపర్చుకునే దిశగా బీసీల్లో పట్టున్న నేతలను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించుకుంది.