
Revanth Reddy: రుణమాఫీపై మీ వ్యాఖ్యలు నిజం కాదు.. సీఎం రేవంత్ రెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రైతుల పంట రుణాలను మాఫీ చేస్తూ, రూ. 2 లక్షల వరకు రుణమాఫీ పథకాన్ని విజయవంతంగా అమలు చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
27 రోజుల్లో 22,22,067 మంది రైతులకు రుణమాఫీ కింద రూ. 17,869.22 కోట్లను విడుదల చేశామని చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక ఇదే అతిపెద్ద రుణమాఫీ పథకమని ఆయన ప్రకటించారు.
రూ. 2 లక్షలకు పైగా రుణం ఉన్న రైతులకు కూడా త్వరలో మాఫీని వర్తింపజేస్తామని ఆయన స్పష్టం చేశారు.
మహారాష్ట్రలో శనివారం జరిగిన బహిరంగ సభలో మీరు కాంగ్రెస్ రుణమాఫీ గురించి మాట్లాడుతూ, ఆ హామీ ఇంకా అమలులో లేదని, రైతులు ఆ వేచిచూస్తున్నారని పేర్కొన్నారు.
Details
మూడో విడతలో రూ.5644.24 కోట్ల మాఫీ
ఈ వ్యాఖ్యలు తనకు ఎంతో నిరాశ కలిగించాయని, ఎందుకంటే అవి వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాస్తూ, కాంగ్రెస్ పార్టీ తన హామీని తక్షణమే అమలు చేసిందని గణాంకాలతో సహా వివరించారు.
మొదటి విడతలో రూ. 1 లక్ష వరకు జులై 18న 11, 34,412 మంది రైతులకు రూ. 6034.97 కోట్ల రుణమాఫీ జరిగిందన్నారు.
రెండో విడతలో జులై 30న రూ. 1.50 లక్షల వరకు 6,40,823 మందికి రూ. 6190.01 కోట్లను మాఫీ చేశామన్నారు.
ఇక మూడో విడతగా ఆగస్టు 15న రూ. 2 లక్షల వరకు 4,46,832 మందికి రూ. 5644.24 కోట్ల రుణాలను మాఫీ చేశారు.
Details
రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యం
ఈ రుణమాఫీ పథకం వల్ల రైతులు అప్పుల ఒత్తిడిని తగ్గించుకుని, వ్యవసాయ ఉత్పాదకతను పెంచుకునే అవకాశాలు ఉన్నాయని సీఎం రేవంత్ విశ్వాసం వ్యక్తం చేశారు.
రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్ధేశమని, రైతుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ముందడుగు వేయాలని ఆశిస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో రేవంత్ తెలిపారు.
పంట రుణమాఫీకి సంబంధించిన పూర్తి వివరాలు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు.
వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిస్తూ, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయన కొనియాడారు.