YS Jagan: రేపటి అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
అనంతరం నిర్వహించే బీఏసీ సమావేశంలో మావేశాల నిర్వహణకు సంబంధించిన కాలపరిమితి నిర్ణయించనున్నారు. ఈ నెల 28న ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.
రేపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ సహా పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకానున్నారు. ఈ మేరకు జగన్ తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.
ముందుగా అసెంబ్లీ కమిటీ హాలులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై, శాసనసభ, మండలిలో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేయనున్నారు.
ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీలు, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనే లక్ష్యంతో వైసీపీ వ్యూహం సిద్ధం చేసినట్లు సమాచారం.
Details
ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ ఆరాటం
ఇక అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా డిమాండ్ చేయాలని వైసీపీ నిర్ణయించింది. ప్రజా సమస్యలపై చర్చించేందుకు, ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్ష హోదా కీలకమని వైసీపీ భావిస్తోంది.
ఈ మేరకు ప్రతిపక్షంగా గుర్తించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఇప్పటి వరకు హైకోర్టుకు తన అభిప్రాయాన్ని స్పీకర్ తెలియజేయలేదు.
ప్రతిపక్ష హోదా కల్పిస్తే ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంటుందని, అదే కారణంగా ప్రభుత్వం భయపడుతోందని వైసీపీ ఆరోపిస్తోంది.
అసెంబ్లీని ఏకపక్షంగా నడిపిస్తున్నారన్న విమర్శలతో రేపు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా డిమాండ్ చేయనున్నట్లు వైసీపీ ప్రకటించింది.