
YS Jagan: వీరజవాన్ మురళీనాయక్ తల్లిదండ్రులను పరామర్శించిన వైఎస్ జగన్.. రూ.25 లక్షలు ఆర్థిక సాయం
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద మే 9న పాక్ జరిపిన కాల్పుల్లో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ మురళీనాయక్ తల్లిదండ్రులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు.
శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు మంగళవారం ఆయన వెళ్లారు.
మురళీ నాయక్ చిత్రపటానికి పుష్పగుచ్ఛం సమర్పించి నివాళులర్పించారు.
జగన్ ఈ సందర్బంగా మురళీనాయక్ తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.
వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మురళీ నాయక్ త్యాగం దేశ యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని కొనియాడారు.
అనంతరం కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు ప్రకటించారు.
వివరాలు
"మురళీ జగన్ సార్ వచ్చాడ్రా.. సెల్యూట్ కొట్టు!"
జగన్‌ను చూసిన వెంటనే మురళీనాయక్ తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనయ్యారు.
తండ్రి శ్రీరామ్ నాయక్ కన్నీళ్లతో మాట్లాడుతూ, "మురళీ.. జగన్ సార్ వచ్చాడ్రా.. సెల్యూట్ కొట్టు!" అంటూ విలపించారు.
ఈ దృశ్యం అక్కడున్న ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురి చేసింది. మురళీ తల్లిని జగన్ సానుభూతి పలుకుతూ ఓదార్చారు.
కుటుంబానికి ఎప్పటికీ అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ఈ సందర్బంగా శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు కూడా జగన్‌తో కలిసి పరామర్శకు హాజరయ్యారు.
వివరాలు
బెంగళూరు నుంచి కారులో..
జగన్ మంగళవారం ఉదయం 9.30కి బెంగళూరులోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరారు.
చిక్కబళ్లాపురం, బాగేపల్లి, కొడికొండ చెక్‌పోస్టు, పాలసముద్రం, గోరంట్ల మీదుగా ప్రయాణించి ఉదయం 11.30 గంటలకు కళ్లితండాకు చేరుకున్నారు.
అక్కడ మురళీనాయక్ కుటుంబ సభ్యులతో దాదాపు గంట పాటు సమావేశమై పరామర్శించారు. అనంతరం మళ్లీ బెంగళూరుకు తిరిగి వెళ్లారు.
జగన్ పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ రత్న నేతృత్వంలో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
వివరాలు
వీర జవాన్ మురళీ నాయక్ - త్యాగానికి దేశం నమస్కరిస్తోంది
మే 9న నియంత్రణ రేఖ వద్ద పాక్ జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందిన మురళీ నాయక్‌కు తల్లి జ్యోతిబాయి, తండ్రి శ్రీరామ్ నాయక్ ఉన్నారు.
మురళీ కుటుంబంలో ఏకైక కుమారుడు. ఆయన మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.
వారి కుటుంబానికి అన్ని విధాలుగా మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ లాంఛనాలతో మురళీ నాయక్ అంత్యక్రియలు నిర్వహించారు.
వివరాలు
ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ యాత్ర - ప్రజల కన్నీటి వీడ్కోలు
శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాలో మురళీ నాయక్ అంత్యక్రియలు ఘనంగా, ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు .
వేలాది మంది స్థానికులు,ఇతర ప్రాంతాల ప్రజలు హాజరై మురళీ నాయక్‌కు కన్నీటి వీడ్కోలు చెప్పారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ సహా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. దేశం అంతటా ఈ త్యాగాన్ని గుర్తుంచుకుంటుందని వారు పేర్కొన్నారు.