Free Gas Cylinder eKYC: ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం ఈ-కేవైసీ ప్రక్రియ.. అర్హతలు ఇవే!
ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం (దీపం-2) పట్ల ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. గ్యాస్ బుకింగ్ ప్రక్రియ ఇవాళ నుండి ప్రారంభమైంది. లబ్దిదారులు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకోవడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందడానికి లబ్దిదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలి. దీనికోసం బ్యాంకు ఖాతా, ఆధార్ లింక్ కూడా పూర్తయినట్లుగా ఉండాలి. ఈ-కేవైసీ ఎలా చేయించుకోవాలి? ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందాలనుకునే వారు తమ గ్యాస్ ఏజెన్సీ వద్ద గ్యాస్ కనెక్షన్, ఆధార్ కార్డ్‌ను, రేషన్ కార్డ్‌తో ఈ-కేవైసీ చేయించుకోవాలి.
బ్యాంకు ఖాతా, ఆధార్ లింక్ తప్పనిసరి
ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, వారి డేటా 24 నుండి 48 గంటల్లో అప్డేట్ అవుతుంది. ఈ-కేవైసీ జరిగిన తర్వాత లబ్దిదారుల మొబైల్ ఫోన్‌కు ఒక మెసేజ్ వస్తుంది. తద్వారా వారు గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. ఈ-కేవైసీ చేయించినప్పుడు గ్యాస్ కనెక్షన్ కేవలం అర్హులైన వ్యక్తుల పేరిట ఉండాలి. లబ్దిదారులు బ్యాంకు ఖాతాను NPCI ద్వారా ఆధార్‌తో లింక్ చేయించుకోవాలి. ఇది బ్యాంకుల ద్వారా చేస్తారు. గ్రామాల వారీగా NPCI లింక్ కోసం వివరాలు సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయి. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఈ సమాచారం పొందవచ్చు.
48 గంటల్లో నగదు జమ
లబ్దిదారుల పేరు లిస్టులో ఉన్నట్లయితే, ఈ-కేవైసీ మరియు NPCI లింక్ పూర్తి చేయడం ద్వారా, గ్యాస్ సిలిండర్ తీసుకున్న 48 గంటల్లో రూ.851 సబ్సిడీ నగదు లబ్దిదారుల ఖాతాలో జమ అవుతుంది. ఈ పథకాన్ని నంబర్ 1న శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వాలు, అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించనున్నాయి.