హోళీ రంగులకు మీ చర్మం పాడవకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు
వసంతం వచ్చేస్తోంది. రంగుల పండగ ముందరే ఉంది. ఈ నేపథ్యంలో హోళీ పండగ రోజున చర్మాన్ని కాపాడే బాధ్యత ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే రంగుల్లో ఉండే రసాయనాలు చర్మానికి హాని కలిగించే అవకాశం ఉంది. ప్రకృతి పరంగా తయారైన రంగుల వాడకం కంటే రసాయనాలతో తయారు చేసే రంగుల వాడకమే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. లేదంటే అనవసర ఎలర్జీలు, దురద వంటివి ఇబ్బంది కలిగిస్తాయి. సన్ స్క్రీన్: సన్ స్క్రీన్ పెట్టుకోకపోతే రంగుల్లోని రసాయనాల వల్ల చర్మం నల్లగా మారడం, దురద కలగడం, అనేక రకాల ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది. చేతులు, ముఖం, మెడ మొదలైన సూర్యునికి కనిపించే భాగాల్లో సన్ స్క్రీన్ మర్దన చేసుకోవాలి.
రంగుల రసాయనాల నుండి చర్మాన్ని కాపాడే సూచనలు
నూనె తో మర్దన: జుట్టుకే కాదు చర్మానికి కూడా ఆయిల్ మేలు చేస్తుంది. కొబ్బరి నూనె తీసుకుని చేతులకు మర్దన చేసుకోండి. దీని కారణంగా రంగులు చర్మానికి పూర్తిగా అతుక్కోకుండా ఉంటాయి. పెదాలకు బామ్: పెదాల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే తొందరగా ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి లిప్ బామ్ తో మర్దన చేసుకుంటే మంచిది. చెవులకు పెట్రోలియం జెల్: చెవి భాగాలు కూడా సున్నితమైనవే. రంగుల వల్ల చెవి భాగాలకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే చెవి చుట్టూ, చెవిపైన పెట్రోలియం జెల్ మర్దన చేసుకోండి. గాయాలను కప్పేయండి: ఆల్రెడీ గాయాలతో మీరు ఇబ్బంది పడుతుంటే ఆ గాయాలను బ్యాండేయిడ్ లేదా ఫుల్ డ్రెస్ తో కవర్ చేసేయండి.