LOADING...
International Womens Day: కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వెనుక కథ
కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వెనుక కథ

International Womens Day: కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వెనుక కథ

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 03, 2025
04:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? మీ వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు దీని గురించి సందేశాలు వచ్చి ఉంటాయి. కానీ, ఈ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? దీని అసలు ఉద్దేశ్యం ఏమిటి? ఇది ఒక వేడుకా, లేక మహిళల హక్కుల కోసం పోరాడే రోజా? అంతర్జాతీయ మహిళా దినోత్సవం లాగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవం కూడా ఉందా? దాదాపు ఒక శతాబ్దంగా ప్రపంచవ్యాప్తంగా మార్చి 8వ తేదీని మహిళల హక్కులను గుర్తించే ప్రత్యేక రోజుగా జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేకమైన దినోత్సవానికి కార్మిక ఉద్యమాలే మూలం. ఐక్యరాజ్య సమితి దీన్ని అధికారికంగా గుర్తించి ప్రతి సంవత్సరం నిర్వహిస్తోంది. ఎందుకో ఈ కథనంలో తెలుసుకోండి.

వివరాలు 

మహిళా దినోత్సవం ఎలా ప్రారంభమైంది? 

1908లో న్యూయార్క్ నగరంలో 15,000 మంది మహిళలు తక్కువ పని గంటలు, మెరుగైన వేతనాలు, ఓటు హక్కు కోసం పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. ఈ ఉద్యమ ప్రభావంతో, 1909లో అమెరికా సోషలిస్టు పార్టీ జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. అంతర్జాతీయ స్థాయిలో ఈ దినోత్సవాన్ని జరపాలన్న ఆలోచన క్లారా జెట్కిన్ అనే జర్మన్ మహిళా ఉద్యమకారిణిదీ. 1910లో కోపెన్‌హెగెన్ నగరంలో జరిగిన 'ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్‌'లో ఆమె ఈ ప్రతిపాదన చేసారు. 17 దేశాల నుంచి హాజరైన 100 మంది మహిళలు ఈ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు.

వివరాలు 

మార్చి 8నే ఎందుకు మహిళా దినోత్సవంగా నిర్ణయించారు? 

1917లో రష్యాలో మహిళలు "ఆహారం - శాంతి" అనే నినాదంతో సమ్మె చేపట్టారు. నాలుగు రోజుల తర్వాత, అప్పటి చక్రవర్తి నికోలస్ జా 2 తన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన తాత్కాలిక ప్రభుత్వం మహిళలకు ఓటు హక్కును మంజూరు చేసింది. ఈ సమ్మె ఫిబ్రవరి 23న జరిగింది (జూలియన్ క్యాలెండర్ ప్రకారం). అయితే, ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అది మార్చి 8 కావడంతో, అదే తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా స్థిరపడింది.

వివరాలు 

అంతర్జాతీయ మహిళా దినోత్సవ థీమ్ - 2025 

2025 సంవ‌త్స‌రం ఈ దినోత్సవం థీమ్ "అందరు మహిళలు, బాలికల కోసం: హక్కులు, సమానత్వం, సాధికారత(For ALL Women and Girls: Rights, Equality, Empowerment)". ఈ థీమ్ ప్రపంచవ్యాప్తంగా మహిళలు,బాలికల పురోగతిని అడ్డుకునే వ్యవస్థాగత అవరోధాలను తొలగించడానికి చేర్చడం, తక్షణ చర్య అవసరాన్ని హైలైట్ చేస్తుంది.

వివరాలు 

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఉందా? 

అవును, నవంబర్ 19 న అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపుకుంటారు. ఇది 1990లో ప్రారంభమైనప్పటికీ, ఐక్యరాజ్య సమితి దీనిని అధికారికంగా గుర్తించలేదు. 60కి పైగా దేశాల్లో పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీని ప్రధాన ఉద్దేశ్యాలు: పురుషుల ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం సానుకూల పురుష స్ఫూర్తిదాయక వ్యక్తులను గుర్తించడం 2018లో దీని థీమ్ "సానుకూల పురుష స్ఫూర్తి ప్రదాతలు" అని నిర్ణయించారు.

వివరాలు 

ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటారు? 

రష్యాలో ఈ రోజు జాతీయ సెలవుదినంగా ఉంటుంది. చైనాలో మహిళా ఉద్యోగులకు సగం రోజు సెలవు ఉంటుంది. ఇటలీలో మిమోసా పువ్వులను బహుమతిగా ఇచ్చే సంప్రదాయం ఉంది. అమెరికాలో మార్చి నెలను మహిళా చరిత్ర నెలగా ప్రకటించారు. మహిళా దినోత్సవం - నిరసనా? వేడుకా? ప్రస్తుతం మహిళా దినోత్సవాన్ని సాధించిన విజయాలను గుర్తించుకునే రోజు గా జరుపుతున్నారు. కానీ, ఈ దినోత్సవం అసలు ఉద్దేశం లింగ అసమానతపై అవగాహన పెంచడం, మహిళల హక్కుల కోసం పోరాడటం.

వివరాలు 

1975లో ఐక్యరాజ్య సమితి అధికారికంగా గుర్తించింది

అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. 1908లో న్యూయార్క్‌లో మహిళలు తమ హక్కుల కోసం పోరాడారు. క్లారా జెట్కిన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఆలోచనను ప్రవేశపెట్టారు. 1911లో కొన్ని యూరప్ దేశాల్లో మొదటిసారిగా జరుపుకున్నారు. 1975లో ఐక్యరాజ్య సమితి అధికారికంగా గుర్తించింది. మార్చి 8 రష్యా మహిళల సమ్మె ఆధారంగా నిర్ణయించబడింది. పురుషుల దినోత్సవం నవంబర్ 19న జరుపుకుంటారు, కానీ అది ఐక్యరాజ్య సమితి గుర్తించలేదు. ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని వివిధ రీతుల్లో జరుపుకుంటారు.