
International Yoga Day 2023: 'యోగా డే'ను ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి ఏటా జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు.
యోగ అనేది శతాబ్దాలుగా భారతీయ సంస్కృతి, దేశ ప్రజల జీవన విధానంలో భాగమైంది.
ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో యోగా ఇమేజ్ అంతర్జాతీయ స్థాయిలో పెరిగిందనే చెప్పాలి.
2015 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తోంది. మొదటి ఏడాది నుంచి యోగా డే అత్యంత ప్రజాదరణ పొందింది.
2014 సెప్టెంబరు 27న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రతిపాదనను మొదటిసారిగా ప్రవేశపెట్టారు.
డిసెంబర్ 11, 2014న ఐక్యరాజ్యసమితి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది.
యోగ
యోగా చరిత్ర ఇదే
యోగా చాలా పురాతనమైనది. దాదాపు 5,000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. 'యోగా' అనే పదం సంస్కృత పదం 'యుజ్' నుంచి ఉద్భవించింది. దీని అర్థం కలయిక.
భౌతిక భంగిమలు, శ్వాస నియంత్రణ, ధ్యానం, నైతిక సూత్రాల ద్వారా మనస్సు, శరీరం, ఆత్మను సమన్వయం చేసే తత్వశాస్త్రాన్ని యోగా కలిగి ఉంటుంది.
యోగా డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో సామూహిక యోగా సెషన్‌లు, మెడిటేషన్ వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు, సాంస్కృతిక ప్రదర్శనలతో సహా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు.
యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలపై ఈ సందర్భంగా అవగాహన కల్పిస్తారు. ఏడాదికేడాది యోగాకు ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. యోగాపై అనేక మంది ఆసక్తిని కనబరుస్తున్నారు.
యోగ
ఈ ఏడాది థీమ్ 'వసుధైవ కుటుంబానికి యోగా'
శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతతను సాధించడానికి యోగా అనేది ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది.
నిరంతరం యోగా చేయడం వల్ల ఆరోగ్యం చాలా మెరగవుతుంది. రుగ్మతలు దరిచేరవు. అంతేకాకుండా శరీరంపై పూర్తి స్థాయిలో నియంత్రణ వస్తుంది. యోగా అభ్యాసకులు ఎంతటి ఒత్తిడినైనా సులువుగా జయించవచ్చు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2023 థీమ్‌ను ప్రధాని మోదీ 'వసుధైవ కుటుంబానికి యోగా' అని ప్రకటించారు.
ఈ ఏడాది 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతోంది. ఈ క్రమంలో ఈ వేడుకలను ప్రధాని మోదీ ప్రతిష్టాత్మంగా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహిచడం చాలా ప్రత్యేకమనే చెప్పాలి.