Page Loader
Mothers Day 2025: అమ్మకి ప్రత్యేక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ ప్రదేశాలకు ట్రిప్ వెళ్లడం బెస్ట్ ఐడియా

Mothers Day 2025: అమ్మకి ప్రత్యేక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ ప్రదేశాలకు ట్రిప్ వెళ్లడం బెస్ట్ ఐడియా

వ్రాసిన వారు Sirish Praharaju
May 08, 2025
12:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

తల్లి అనేది కేవలం ఒక బంధం మాత్రమే కాదు, అది త్యాగానికి, అహంకారశూన్యతకు, ప్రేమకు ప్రతీక. పిల్లల పుట్టుకనుంచి, వారి అవసరాలన్నింటినీ తీర్చడం వరకు, తల్లి తన వ్యక్తిగత అవసరాలన్నింటినీ పక్కన పెట్టి పిల్లల క్షేమం కోసం జీవిస్తుంది. పిల్లల కోరికలు, అవసరాలు తీరుస్తూ, వారిని క్షేమంగా, ఆనందంగా చూసుకోవడం తన ధర్మంగా భావిస్తుంది. పిల్లలకు, పెద్దలకి సెలవులు ఉండే ఆదివారాలు, పండుగలు, ప్రత్యేక రోజులు తల్లికి మాత్రం పనులు మానే రోజు ఉండదు. ప్రతి రోజు, గంటల పాటు అలసిపోకుండా కుటుంబం కోసం కృషి చేస్తూనే ఉంటుంది.

వివరాలు 

రోజూ చేసే పనుల నుంచి కొంత విరామం

ఈ నేపథ్యంలో, మదర్స్ డే సందర్భంగా అమ్మకి కొంచెం విశ్రాంతిని అందించాలని భావిస్తే కుటుంబంతో కలిసి బయటకెళ్ళడం ఓ మంచి ఆలోచన. కొత్త ప్రదేశాలకు తీసుకెళ్లడం వల్ల అమ్మకు మానసికంగా ఓ మంచి అనుభూతి కలుగుతుంది. రోజూ చేసే పనుల నుంచి కొంత విరామం దొరుకుతుంది. వాస్తవానికి అమ్మను స్పెషల్‌గా ఫీల్ చేయించడానికి ఏదైనా ఒక్కరోజు అవసరం లేదు కానీ, రోజువారి జీవితంలో బిజీగా ఉండే మనం, అమ్మతో సమయం గడిపేందుకు ప్రత్యేకంగా రోజు కేటాయించడం అవసరమే. అందుకే మదర్స్ డే రోజున అమ్మతో కుటుంబం కలిసి పర్యటనకు వెళ్ళడం చాలా మంచిది.

వివరాలు 

1. నైనిటాల్

ఢిల్లీకి సమీపంగా ఉండే ఈ ప్రదేశం,సహజసిద్ధమైన అందాలతో పరిపూర్ణంగా ఉంటుంది. నైని సరస్సులో బోటింగ్ అనుభవించవచ్చు. స్నో వ్యూ పాయింట్ నుంచి మంచుతో కప్పబడిన పర్వతాలను చూడవచ్చు. నైని శిఖరం ప్రాంతంలోకి చేరితే చుట్టుపక్కల ఉన్న దృశ్యం అద్భుతంగా కనిపిస్తుంది. నైనా దేవి ఆలయం, హనుమాన్‌గఢి వంటి పుణ్యక్షేత్రాలు కూడా చూడవచ్చు. పాంగోట్, షాంఘర్ వంటి గ్రామాల్లో ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. నిశ్శబ్దంగా, ప్రకృతి మధ్య సేదతీరి, ప్రశాంతంగా గడిపేందుకు నైనిటాల్‌కి అమ్మతో కలిసి వెళ్ళడం ఓ అద్భుతమైన ఎంపిక.

వివరాలు 

2. ఊటీ

వేసవి కాలంలో పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఊటీ,తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఉంది. ఇది పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తుంది. మార్చి నుంచి జూన్ మధ్య కాలం ఇక్కడ పర్యటనకు ఉత్తమ సమయం. ఊటీ సరస్సు, బొటానికల్ గార్డెన్, టాయ్ ట్రైన్, రోజ్ గార్డెన్ వంటి ప్రదేశాలు తప్పకుండా చూడదగినవే. దీనితో పాటు దొడ్డబెట్ట శిఖరం, పైకారా జలపాతం, పైకారా సరస్సు, అవలాంచె సరస్సు, ఎమరాల్డ్ సరస్సు వంటి సహజ సౌందర్యంతో నిండిన ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు. అదనంగా, జింకల పార్క్ కూడా ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ.

వివరాలు 

3. ఉదయపూర్

ప్రకృతి సౌందర్యం,చారిత్రక రాజభవనాలు,సరస్సుల వల్ల ప్రసిద్ధిగాంచిన ఉదయపూర్‌ను సరస్సుల నగరం (City of Lakes) అని కూడా పిలుస్తారు. అమ్మతో కలసి ఇక్కడి సరస్సులను, ప్యాలెస్‌లను దర్శించడమంటే ఆమెకు ప్రత్యేక అనుభూతిని కలిగించడమే. పిచోలా సరస్సు,సిటీ ప్యాలెస్,సజ్జన్‌గఢ్ ప్యాలెస్, దూద్ తలై మ్యూజికల్ గార్డెన్, ఫతే సాగర్ లేక్, జైసమంద్ సరస్సు, సహేలియన్ కి బారి, రోజ్ గార్డెన్, జూ, జగ్ మందిర్ ప్యాలెస్ వంటి అనేక ప్రదేశాలను చూసి ఆనందించవచ్చు. అలాగే బడా మహల్, మహారాణా ప్రతాప్ మెమోరియల్, ఇండియన్ ఫోక్ ఆర్ట్ మ్యూజియం, లాకే పాలాయ్ మ్యూజియం వంటి సంస్కృతిని ప్రతిబింబించే ప్రదేశాలను సందర్శించవచ్చు. రోప్‌వే రైడ్ ద్వారా ఉదయపూర్ నగరాన్ని ఎత్తునుంచి చూడటం మరో ప్రత్యేక అనుభవం.

వివరాలు 

జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం

ఈ మదర్స్ డే సందర్భంగా అమ్మకు మీ ప్రేమను తెలియజేయడానికి గొప్ప గిఫ్ట్‌గా ఇలా ఒక ట్రిప్ ప్లాన్ చేయండి. ఇది ఆమెకు తాత్కాలికంగా పని నుంచి విరామాన్ని ఇచ్చే విషయంలోనే కాదు, జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా నిలుస్తుంది.