బరువు తగ్గాలని కార్బోహైడ్రేట్లు తక్కువ తింటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో తెలుసుకోండి
లావుగా ఉన్న వాళ్ళు బరువు తగ్గాలని కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఆహారాలని తీసుకుంటారు. దీనివల్ల బరువు తగ్గడం నిజమే అయినా కానీ, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ కొద్ది రోజులే అయినా కానీ, వాటి గురించి తెలుసుకోవడం మంచిది. తలనొప్పి: తక్కువ కార్బోహైడ్రేట్లు తీసుకున్నప్పుడు మీ రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి. దానివల్ల తలనొప్పి కలుగుతుంది. కొంతమందిలో నీళ్ళు ఎక్కువగా తాగకపోవడం వల్ల కూడా తలనొప్పి కలుగుతుంది. అందుకే కావాల్సినన్ని నీళ్ళు తాగాలి. కండరాలు పట్టేయడం: కార్బోహైడ్రేట్లు తక్కువ తిన్నప్పుడు ఇన్సులిన్ తక్కువ ఉత్పత్తి అవుతుంది. దానివల్ల కండరాల్లో గ్లైకోజన్ తగ్గిపోయి కండరాలు పట్టేస్తాయి. వ్యాయామం చేసినపుడు శక్తినిచ్చే మూలకంగా గ్లైకోజన్ పనిచేస్తుంది. గ్లైకోజన్ తగ్గిపోతే అలసట వస్తుంది.
తక్కువ కార్బోహైడ్రేట్లు శరీరానికి చేసే నష్టాలు
నోటి దుర్వాసన: కార్బోహైడ్రేట్లు తక్కువ తీసుకున్నప్పుడు శరీరానికి శక్తి సరిగ్గా అందదు. దానివల్ల ఆల్రెడీ శరీరంలో ఉన్న కొవ్వును శక్తి కోసం శరీరం ఉపయోగించుకుంటుంది. ఈ పద్దతినే కీటోసిస్ అంటారు. ఈ పద్దతిలో శరీరంలో కీటోన్స్ ఉత్పత్తి అవుతాయి. ఆ కీటోన్స్ అనేవి నోటి ద్వారా, చెమట ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. అందుకే నోటి నుండి దుర్వాసన వస్తుంది. మలబద్దకం: కార్బోహైడ్రేట్లు తగ్గించినపుడు అనుకోకుండానే ఫైబర్ తీసుకోవడం తగ్గుతుంది. ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి ఫైబర్ చాలా మేలు చేస్తుంది. ఫైబర్ సరిగా తీసుకోనపుడు ప్రేగులలో కదలికలు సక్రమంగా ఉండకుండా మలబద్దకానికి దారి తీస్తుంది. ఈ పరిస్థితిని నివారించడానికి, కావాల్సినన్ని నీళ్ళు తాగడం మంచిది.