Onam Festival 2026: ఓనం పండుగ.. 10 రోజులు ఎందుకు జరుపుకుంటారో తెలుసా? ఇదే అసలు కారణం!
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలో ఓనం పండగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. పంటలు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ వేడుకల్లో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ పాల్గొంటారు. మహాబలి చక్రవర్తిని స్మరించుకుంటూ, కేరళ వారసత్వాన్ని చాటిచెప్పేలా ఓనం ఉత్సవాలను పది రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ పది రోజుల్లో ప్రతి రోజుకు ఓ ప్రత్యేక పేరు, ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఇంతకీ ఓనం పండుగను పది రోజుల పాటు ఎందుకు జరుపుకుంటారు? ఈ రోజుల్లో ఏం చేస్తారు? ఇప్పుడు తెలుసుకుందాం. ఓనం ఉత్సవాలు అథం రోజుతో ప్రారంభమవుతాయి. ఈ రోజున ఇళ్లను శుభ్రం చేసి, పూలతో అలంకరించే 'పూకలం' (పువ్వుల రంగోలి) వేయడం ప్రారంభిస్తారు. దీంతో ఓనం వేడుకలు మొదలైనట్లు భావిస్తారు.
వివరాలు
రోజుకో ప్రత్యేకత..
కేరళలో మహిళలు సంప్రదాయ తెల్లటి కసావు చీరలు ధరించి, బంగారు ఆభరణాలతో ముస్తాబవుతారు.
ఇళ్లను పూలతో అలంకరించి, పులిస్సేరి, ఖీర్ వంటి సంప్రదాయ వంటకాలను తయారు చేస్తారు.
చితిర ఓనం పండుగలో రెండో రోజు. ఈ రోజున ఇళ్ల ముందు వేసే పూకలానికి కొత్త పూలను జోడించి మరింత అందంగా అలంకరిస్తారు.
పూజలు నిర్వహిస్తూ, సంప్రదాయ ఆచారాలను పాటిస్తారు. మహాబలి చక్రవర్తిని స్వాగతిస్తున్నట్లుగా వేడుకలు నిర్వహిస్తారు.
చోధి మూడో రోజు. ఈ రోజును సాంస్కృతిక కార్యక్రమాలకు కేటాయిస్తారు.
కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కలిసి పాటలు పాడుతూ, నాటకాలు వేస్తూ, నృత్యాలు చేస్తూ పండుగను ఆనందంగా జరుపుకుంటారు.
వివరాలు
కోలాహలంగా పడవ పందేలు..
ఓనం నాలుగో రోజును విశాఖం అంటారు. ఈ రోజున కుటుంబ సభ్యులంతా కలిసి వేడుకలు నిర్వహిస్తారు.
మహాబలి చక్రవర్తి, వామనుడి చిన్న మట్టి విగ్రహాలను ఇంటి ఆవరణలో ప్రతిష్ఠిస్తారు.
మహాబలి దాతృత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనతో పాటు వామనుడి విగ్రహాలకు పూజలు చేస్తారు.
కుటుంబ సభ్యులంతా కలిసి ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ పండుగను ఘనంగా జరుపుకుంటారు.
అనిజం ఓనం పండుగలో ఐదో రోజు. ఈ రోజున పడవ పోటీలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
పెద్ద పడవల్లో వందలాది మంది ఒకేసారి పడవ నడుపుతూ, పాటలు పాడుతూ పోటీపడతారు.
కేరళలో ఓనం సందర్భంగా జరిగే అత్యంత ఉత్సాహభరితమైన కార్యక్రమాల్లో ఈ పడవ పందేలు ఒకటి. ఓనం వేడుకల్లో ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
వివరాలు
ప్రత్యేకమైన ఆచారాలు పాటిస్తారిలా..
ఆరో రోజు త్రికేట. ఈ రోజు నుంచి విందు ఏర్పాట్లు ఊపందుకుంటాయి. పెద్దలు, పిల్లలు కలిసి వంటకాల తయారీలో పాల్గొంటారు.
ఇళ్ల అలంకరణ, పూలతో పూకలం వేయడం కూడా కొనసాగుతుంది.
కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఒకచోట చేరడంతో పండుగ వాతావరణం మరింత సందడిగా మారుతుంది.
మూలం ఏడో రోజు. ఈ రోజున కేరళలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
పూకలాన్ని కొత్త డిజైన్లతో మరింత అందంగా అలంకరిస్తారు. సంప్రదాయ ఆచారాలను పాటిస్తూ ఓనం వేడుకలను కొనసాగిస్తారు.
ఓనం ఎనిమిదో రోజును పూరాడం అంటారు. ఈ రోజున ప్రత్యేకమైన ఆచారాలు నిర్వహిస్తారు. 'ఓనత్తప్పన్' పేరుతో మహాబలి మహారాజు మట్టి విగ్రహాన్ని ఇళ్లలో ప్రతిష్ఠిస్తారు.
వివరాలు
మహాబలి చక్రవర్తి తన ప్రజలను చూడటానికి వస్తాడనే నమ్మకం..
ఉత్త్రాడం ఓనం పండుగలో తొమ్మిదో రోజు. ఈ రోజును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.
ఓనం విందు కోసం వివిధ రకాల వంటకాలను సిద్ధం చేస్తారు. చివరి రోజు తిరువోనం. ఓనం పండుగలో ఇదే అత్యంత ముఖ్యమైన రోజు.
ఈ రోజున మహాబలి చక్రవర్తి తన ప్రజలను చూడటానికి వస్తాడనే నమ్మకం ఉంది.
దీంతో కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి 'ఓనసాధ్య' పేరుతో సంప్రదాయ విందులో పాల్గొంటారు.
ఇలా అథం నుంచి తిరువోనం వరకు పది రోజుల పాటు జరిగే ఓనం వేడుకలు కేరళ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వం, కుటుంబ సమైక్యతకు ప్రతీకగా నిలుస్తాయి.
ప్రతి రోజుకూ ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉండటమే ఓనం పండుగ ప్రత్యేకత.