Winter Festivals in India: శీతాకాలంలో జరిగే ప్రత్యేక ఉత్సవాలు ఇవే.. ఒకసారి చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
భారతదేశం అనేది సాంస్కృతిక, సంప్రదాయాలు, సహజ వైవిధ్యానికి నిలయమని చెప్పొచ్చు. ప్రతి పండుగ, సంప్రదాయం మన దేశంలో ప్రత్యేకమైన వన్నెను తీసుకొస్తాయి. భారతదేశం అనేక రాష్ట్రాల్లో వాతావరణానికి అనుగుణంగా పండుగలు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇవి పండుగలతో పాటు దేశంలోని సంప్రదాయాలను, సంస్కృతులను తెలుసుకునేందుకు మంచి అవకాశాలను అందిస్తాయి. శీతాకాలంలో పండుగలు జరుపుకోవడం ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. శీతాకాలంలో కొన్ని ప్రదేశాలలో జరిగే ప్రత్యేక ఉత్సవాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1. రణ్ ఉత్సవం - గుజరాత్
గుజరాత్ రాష్ట్రంలో శీతాకాలంలో నిర్వహించే రణ్ ఉత్సవం అనేది ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. ఇక్కడ గర్బా, దాండియా వంటి సాంప్రదాయక నృత్యాలు, హస్తకళలు, పాక్ గుజరాత్ వంటకాలు మనసుని హత్తుకుంటాయి. నవంబర్ నుండి మార్చి మధ్య ఈ ఉత్సవం జరుగుతుంది. 2. హిమాచల్ వింటర్ కార్నివాల్ - హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి, సిమ్లా వంటి హిల్ స్టేషన్లలో శీతాకాలంలో నిర్వహించే వింటర్ కార్నివాల్ ప్రత్యేకమైంది. ఇందులో స్కీయింగ్ పోటీలు, ఫుట్ రైడింగ్, వీధి నాటకాలు, సాంప్రదాయ ఆహారాలు వంటివి ఉంటాయి. డిసెంబర్ నుండి ఫిబ్రవరి మధ్య నిర్వహించే ఈ ఉత్సవం హిమాచల్ సంస్కృతిని ఆస్వాదించేందుకు అనువైన అవకాశం కల్పిస్తుంది.
3. హార్న్‌బిల్ ఫెస్టివల్- కోహిమా
నాగాలాండ్‌లోని కోహిమాలో జరిపే హార్న్‌బిల్ ఫెస్టివల్ పండుగల పండుగగా పేరుగాంచింది. ఇందులో నాగాలాండ్ గిరిజనుల సంస్కృతిని, సంగీతం, నృత్యం, ఆటలను చూడవచ్చు. ప్రత్యేకమైన గిరిజన వంటకాలతో పాటు కుస్తీ పోటీలు, జానపద నృత్యాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. 4. జైసల్మేర్ ఎడారి పండుగ - రాజస్థాన్ రాజస్థాన్‌లోని థార్ ఎడారిలో జరిగే జైసల్మేర్ ఎడారి పండుగ ఒక విశేషమైన అనుభవాన్ని ఇస్తుంది. ఒంటెల పందాలు, జానపద సంగీతం, తోలుబొమ్మ ప్రదర్శనలు, రంగురంగుల దుస్తులు ధరించిన ఒంటెలు చేసే నృత్యాలు అద్భుతంగా ఉంటాయి. ఈ పండుగ ఫిబ్రవరిలో నిర్వహిస్తారు.
5. సోన్‌పూర్ ఫెయిర్ - బీహార్
బిహార్ రాష్ట్రంలోని సోన్‌పూర్ ఫెయిర్ అనేది ఆసియాలోని అతిపెద్ద పశువుల జాతరగా ప్రసిద్దిగా ఉంది. గండక్, గంగా నదుల సంగమ ప్రదేశంలో జరిగే ఈ ఉత్సవం ఆధ్యాత్మిక, సాంస్కృతిక అనుభవాలను అందిస్తుంది. ఈ పండుగను నవంబర్ నుండి డిసెంబర్ మధ్య సందర్శించవచ్చు. ఈ శీతాకాలపు ప్రత్యేక ఉత్సవాలు భారతదేశం యొక్క సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తాయి. ఇక ఈ వేడుకల్లో పాల్గొంటే ఓ అపూర్వమైన అనుభూతిని కలుగుతుంది.