చంద్రయాన్-3: చంద్రుడి మీద పరిశోధనలు మొదలుపెట్టిన ప్రగ్యాన్ రోవర్
చంద్రుడి దక్షిణ ధృవం మీద అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారతదేశం చరిత్ర సృష్టించింది. జాబిల్లిపై ల్యాండర్ మాడ్యూల్ అడుగుపెట్టిన అపురూప క్షణాలు భారతీయుల గుండెల్లో ఎంతో ఆనందాన్ని తీసుకొచ్చాయి. జాబిల్లిపై దిగిన ల్యాండర్ మాడ్యూల్ నుండి 4గంటల తర్వాత ప్రగ్యాన్ రోవర్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ప్రగ్యాన్ రోవర్ చంద్రుడి మీద పరిశోధనలు మొదలు పెట్టిందని ఇస్రో వెల్లడి చేసింది. చంద్రుడి మీద 14రోజుల పాటు ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ పరిశోధనలు చేయనున్నాయి. ఇంతకీ ప్రగ్యాన్ రోవర్ చేసే పరిశోధనలు ఏంటంటే? లేజర్ బీమ్ ద్వారా చంద్రుడి ఉపరితలం మీద ఖనిజాలు, మూలకాలను పరిశోధిస్తుంది. ఇంకా రేడియో ధార్మిక పదార్థాల ద్వారా వెలువడే ఆల్ఫా కణాలను స్కాన్ చేస్తుంది.
ల్యాండర్ మాడ్యూల్ ఏం చేస్తుందంటే?
ల్యాండర్ మాడ్యూల్ లో మూడు పేలోడ్స్ ఉన్నాయి. అవి RAMBHA, ILSA ఇంకా ChaSTE. రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్‌సెన్సిటివ్ అయానోస్పియర్ అండ్ అట్మాస్పియర్ (రంభ) పేలోడ్, చంద్రుడి వాతావరణాన్ని అధ్యయనం చేస్తుంది. చంద్రుడి మీద వచ్చే కంపనాలను ILSA(Instrument for Lunar Seismic Activity) స్కాన్ చేస్తుంది. భూమి మీద భూకంపం ఎలా వస్తుందో, చంద్రుడి మీద కూడా అలాగే వచ్చే కంపనాలను ఇది స్కాన్ చేస్తుంది. చివరగా ChaSTE (Chandra's Surface Thermophysical Experiment) చంద్రుడి ఉపరితల ఉష్ణోగ్రతను కొలుస్తుంది. ప్రగ్యాన్ రోవర్ తాను తెలుసుకున్న సమాచారాన్ని ల్యాండర్ కి తెలియజేస్తుంది. ల్యాండర్ నుండి బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి సమాచారం అందుతుంది.