Page Loader
Shubhanshu Shukla: అంతరిక్షంలో గడిపి తిరిగొచ్చిన శుభాంషు శుక్లా.. భార్యాబిడ్డలను గుండెలకు హత్తుకుని భావోద్వేగం
భార్యాబిడ్డలను గుండెలకు హత్తుకుని శుభాంషు శుక్లా భావోద్వేగం

Shubhanshu Shukla: అంతరిక్షంలో గడిపి తిరిగొచ్చిన శుభాంషు శుక్లా.. భార్యాబిడ్డలను గుండెలకు హత్తుకుని భావోద్వేగం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2025
09:49 am

ఈ వార్తాకథనం ఏంటి

18 రోజుల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) మిషన్ ముగిశాక భూమిపైకి తిరిగి వచ్చిన భారతీయ వ్యోమగామి శుభాంషు శుక్లా బుధవారం తన భార్య కామ్నా శుక్లా, ఆరేళ్ల కుమారుడు కియాష్ శుక్లాను కలసినప్పుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన కుటుంబ సభ్యులను కలసిన ఆనందభరితమైన క్షణాలను శుభాంషు శుక్లా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అంతరిక్ష ప్రయాణం ఒక ప్రత్యేకమైన అనుభవమే అయినా, ఎంతోకాలం తర్వాత తన ప్రియమైన వారిని కలుసుకోవడం కూడా అంతే అద్భుతంగా అనిపించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే రెండు నెలలుగా తాను క్వారంటైన్‌లో ఉన్నానని తెలిపారు.

వివరాలు 

క్వారంటైన్ సమయంలో.. ఎనిమిది మీటర్ల దూరం

క్వారంటైన్ సమయంలో తన కుటుంబ సభ్యులు వచ్చి చూడగా, ఎనిమిది మీటర్ల దూరం పాటించాల్సి వచ్చిందని చెప్పారు. తన కొడుకు చేతులకు బ్యాక్టీరియా ఉంటుందేమోనన్న భయంతో అతడిని హత్తుకునే అవకాశం దక్కలేదని పేర్కొన్నారు. "భూమికి తిరిగి వచ్చి నా భార్య, కుమారుడిని మళ్లీ కౌగిలించుకున్నప్పుడు నిజంగా ఇంటికి తిరిగివచ్చినట్టే అనిపించింది. ఈ రోజు మీరు ప్రేమించే వారిని హత్తుకుని, వారిని ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పండి. జీవితపు దినచర్యల్లో మనం ఎందరో ప్రియమైనవారిని ఎంతగానో నిర్లక్ష్యం చేస్తాం. మానవ అంతరిక్ష ప్రయాణాలు మాయాజాలం లాంటివి. కానీ వాటిని మాయాజాలంగా మార్చేది మనుషులే," అని భావోద్వేగంగా తెలిపారు.

వివరాలు 

అంతరిక్షానికి వెళ్లిన రెండవ భారతీయుడిగా రికార్డు

అమెరికాకు చెందిన ఆక్సియమ్ స్పేస్ సంస్థకు చెందిన వ్యోమగాములు బుధవారం టెక్సాస్‌కు తిరిగి వచ్చిన సందర్భంగా సంస్థ ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించింది. నాసా, స్పేస్‌-x, ఇస్రో తదితర ప్రభుత్వ అంతరిక్ష సంస్థల సహకారంతో, ఆక్సియమ్ స్పేస్ సంస్థ నేతృత్వంలో 20 రోజుల మిషన్ జూన్ 26న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రారంభమైనట్లు అమెరికా సంస్థ తమ X అకౌంట్‌లో వెల్లడించింది. శుభాంషు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన మొదటి భారతీయుడే కాక, 1984లో సోవియట్ మిషన్ కింద రాకేష్ శర్మ ప్రయాణించిన తరువాత అంతరిక్షానికి వెళ్లిన రెండవ భారతీయుడిగా రికార్డు సృష్టించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ట్విట్టర్ పోస్ట్