చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సల్ఫర్‌ను కనుగొన్న ప్రగ్యాన్ రోవర్, హైడ్రోజన్ కోసం అన్వేషణ
చంద్రయాన్-3 ప్రజ్ఞాన్ రోవర్ దక్షిణ ధ్రువం సమీపంలో చంద్రుని ఉపరితలంలో సల్ఫర్ ఉనికిని ధృవీకరించిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మంగళవారం తెలిపింది. ఈ మూలకాలను పరిశోధించేందుకు ప్రజ్ఞాన్ రోవర్‌లో లేజర్-ఇండ్యుసెడ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోపీ (LIBS) పరికరాన్నిఅమర్చారు. బెంగళూరులోని ఇస్రో ఎలక్ట్రో-ఆప్టిక్స్ సిస్టమ్స్ లో ఎల్ఐబీఎస్ పేలోడ్ ను అభివృద్ధి చేశారు. జాబిల్లి దక్షిణ ధ్రువంపై LIBS తన మొట్టమొదటి శాస్త్రీయ పరిశోధన చేసిందని ఇస్రో తెలిపింది. దక్షిణ ధ్రువానికి దగ్గరలో సల్ఫర్ ఉన్నట్లు ఇస్రో పేర్కొంది. చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో హైడ్రోజన్ కోసం అన్వేషణ కొనసాగుతోందని ఇస్రో సంస్థ తెలిపింది. అల్యూమినియం,కాల్షియం,ఫెర్రస్,క్రోమియం,టైటానియం,మాంగనీస్,సిలికాన్ ,ఆక్సిజన్‌లను కూడా ఊహించినట్లుగానే ప్రజ్ఞాన్ రోవర్ గుర్తించిందని ఇస్రో సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది.
మిషన్ మరో ఏడు రోజుల పాటు కొనసాగే అవకాశం
ఎల్ఐబీఎస్ శాస్త్రీయ సాంకేతికత ఆధారంగా మూలకాలను విశ్లేషిస్తుందని ఇస్రో తెలిపింది. చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై నేల ఉష్ణోగ్రతను వివరించిన కొన్ని రోజుల తర్వాత తాజాగా ఈ విషయాన్ని వెల్లడి చేసింది. X లో ఇస్రో పంచుకున్న పరిశీలనల గ్రాఫ్, ప్రోబ్ చొచ్చుకుపోయే సమయంలో నమోదు చేయబడినట్లుగా, వివిధ లోతుల వద్ద చంద్ర ఉపరితల ఉష్ణోగ్రత వైవిధ్యాలను వివరించింది. గ్రాఫ్ ప్రకారం లోతు పెరుగుతున్న కొద్దీ చంద్రుని ఉపరితలంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. సౌరశక్తితో నడిచే ప్రజ్ఞాన్ రోవర్ ,విక్రమ్ ల్యాండర్ శాస్త్రీయ ప్రయోగాల పరంపరను కొనసాగిస్తున్నందున, మిషన్ మరో ఏడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ల్యాండర్ మోహరించినప్పటి నుండి, రోవర్ సుమారు ఎనిమిది మీటర్ల దూరాన్ని కవర్ చేసింది.