
Agni 5: అగ్ని 5 క్షిపణులతో సరికొత్త అస్త్రం అభివృద్ధి చేస్తున్నభారత్.. 7500 కిలోల పేలోడ్ మోసుకెళ్లే సామర్థ్యం వీటి సొంతం
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల జరిగిన ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా, శక్తివంతమైన బీ2 బాంబర్లతో ఇరాన్‌లోని మూడు అణు స్థావరాలపై ఆకస్మిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్‌లను (ఎంఓపీ) ఉపయోగించడం వల్ల, ఇరాన్‌లోని అణు స్థావరాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. అత్యంత బలమైన రక్షణతో ఉండే బంకర్లను సైతం ఈ బాంబులు నాశనం చేయగలవు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ కూడా ఆధునిక బంకర్ బస్టర్ క్షిపణుల అభివృద్ధిపై దృష్టి సారించింది. ప్రధానంగా శత్రు దేశాల్లోని భూగర్భ లక్ష్యాలను ఛేదించడానికి వీలుగా ఈ క్షిపణులను రూపొందిస్తున్నారు.
వివరాలు
ఈ క్షిపణి సుమారు 7,500కిలోల బరువుతో కూడిన వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు
ఈ క్రమంలో డీఆర్‌డీవో (రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ) ఆధునిక అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి వేరియంట్‌పై పనులు చేస్తోంది అనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. అభివృద్ధిలో ఉన్న ఈ క్షిపణి సుమారు 7,500కిలోల బరువుతో కూడిన వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు. ఇది భూమిలో 100మీటర్ల లోతు వరకూ చొచ్చుకెళ్లి లక్ష్యాలను సమర్థవంతంగా నాశనం చేయగలదు. పాకిస్థాన్, చైనా వంటి పొరుగుదేశాల్లో ఉన్న కమాండ్ సెంటర్లు,క్షిపణుల నిల్వ కేంద్రాలు, ఇతర భూగర్భ మౌలిక సదుపాయాలు ఈ క్షిపణుల ప్రధాన లక్ష్యాలు. బంకర్ బస్టర్ క్షిపణులు అంటే భూమిలో లోతుగా ఉండే, బలంగా నిర్మించిన సైనిక బంకర్లు,కమాండ్ కేంద్రాలు, క్షిపణుల నిల్వ ప్రాంతాలు,ఆయుధ గోదాములు వంటి లక్ష్యాలను ధ్వంసం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన బాంబులు లేదా క్షిపణులు.
వివరాలు
అగ్ని-5 క్షిపణికి 5,000కిలోమీటర్లకుపైగా పరిధి
ఇవి కాంక్రీటు, రాయి, మట్టిపొరలను తొలిచుకుంటూ లోపలికి చొచ్చుకెళ్లి పేలిపోతాయి. డీఆర్‌డీవో రూపొందిస్తున్న అగ్ని-5 క్షిపణికి 5,000కిలోమీటర్లకుపైగా పరిధి ఉంది. ఈ క్షిపణి 7,500కిలోల సాంప్రదాయ వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు. అయితే పేలోడ్ సామర్థ్యాన్ని పెంచే దిశగా పరిధిని 2,500కిలోమీటర్లకు పరిమితం చేశారు. ఈమార్పులతో ఖచ్చితత్వం,దెబ్బల తీవ్రత పెరుగుతుందని అంచనా. ఇప్పుడు అగ్ని-5కు రెండు కొత్త వెర్షన్లను అభివృద్ధి చేస్తున్నారు. ఒకటి గగనతలంపై పేలేలా ఉపరితల లక్ష్యాలను నిశితంగా తాకేలా రూపొందించగా, మరొకటి భూగర్భంలో లోతుగా చొచ్చుకెళ్లి పేలేలా ఉంది. రెండో వెర్షన్ అమెరికా తయారు చేసిన GBU-57ను తలపించేలా ఉంటుంది. ఇది సుమారు 8టన్నుల వరకు పేలోడ్‌ను మోసుకెళ్లగలదు.ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సాంప్రదాయ వార్‌హెడ్‌లలో ఇది ఒకటిగా గుర్తింపు పొందే అవకాశం ఉంది.
వివరాలు
గంటకు సుమారు 9,878 నుండి 24,700 కిలోమీటర్ల వేగం
అమెరికా తన బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించేందుకు పెద్ద బాంబర్ విమానాలపై ఆధారపడుతుంది. కానీ భారత్ క్షిపణి ఆధారిత డెలివరీ వ్యవస్థను ఎంచుకోవడం విశేషం. ఇది వ్యయాన్ని తగ్గించడమే కాక, ఆపరేషనల్ సరళతను, సర్వైవబులిటీని కూడా పెంచుతుంది. అగ్ని-5 క్షిపణులు మాక్ 8 నుండి మాక్ 20 వేగంతో ప్రయాణించగలవు. అంటే గంటకు సుమారు 9,878 నుండి 24,700 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ లక్షణం ప్రపంచంలోని అత్యాధునిక ఆయుధ వ్యవస్థల సరసన దీనిని నిలబెడుతుంది.
వివరాలు
ఏమిటీ బంకర్ బస్టర్లు?
భూమి లోపల గట్టిగా నిర్మించిన సైనిక బంకర్లు, కమాండ్ కేంద్రాలు, క్షిపణుల నిల్వ గదులు, ఆయుధ కేంద్రాల వంటి లక్ష్యాలను ధ్వంసం చేయడానికి రూపొందించిన ప్రత్యేక మిస్సైళ్లు లేదా బాంబులే బంకర్ బస్టర్‌లు. ఇవి భూగర్భ గోడలు, కాంక్రీటు పొరలు, రాతిపురుగుల మధ్య దూరంగా చొచ్చుకెళ్లి లోపల పేలిపోతాయి. అమెరికా వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన బంకర్ బస్టర్..మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ (ఎంఓపీ).. సుమారు 3,000 పౌండ్ల బరువు కలిగిఉంటుంది. ఇటీవల అమెరికా ఇదే ఎంఓపీ బాంబులను ఇరాన్ అణు స్థావరాలపై వాడింది. ఈ బాంబులు మందపాటి స్టీల్‌తో తయారు చేయబడి, అధికంగా పేలుడు పదార్థాలతో నిండి ఉంటాయి.
వివరాలు
బాంబు ఎప్పుడు పేలాలో ముందే నిర్ణయం
వీటిలో డిలే ఫ్యూజ్‌లను అమర్చినట్లు ఉంటుంది. దీని సహాయంతో బాంబు ఎప్పుడు పేలాలో ముందే నిర్ణయించవచ్చు. దీని వల్ల బాంబు లోతుగా చొచ్చుకెళ్లిన తర్వాత మాత్రమే పేలుతుంది. ఫలితంగా, ఉపరితలానికి లోపల ఉన్న ముఖ్యమైన లక్ష్యాలను ఖచ్చితంగా ధ్వంసం చేయడం సాధ్యమవుతుంది. ఈ బాంబులను అభివృద్ధి చేయడంలో అమెరికా విస్తృతంగా పరీక్షలు నిర్వహించింది. "మాక్ అండర్‌గ్రౌండ్ ఫెసిలిటీస్"పై వందలాది ట్రయల్స్ చేపట్టారు. భూగర్భంలో ఉన్న టన్నెల్స్ గుండా ప్రయాణిస్తూ లోపల ఉన్న కీలక వసతులను సమర్థంగా ధ్వంసం చేయగల సామర్థ్యాన్ని కలిగించే వరకు ప్రయోగాలను కొనసాగించారు.