Page Loader
Shubhanshu Shukla: జూన్‌ 8న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ లాంచ్ కాంప్లెక్స్ నుండి అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా
జూన్‌ 8న అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా

Shubhanshu Shukla: జూన్‌ 8న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ లాంచ్ కాంప్లెక్స్ నుండి అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా

వ్రాసిన వారు Sirish Praharaju
May 15, 2025
08:55 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర తేది ఖరారైంది. యాక్సియం స్పేస్‌ సంస్థ చేపట్టిన యాక్సియం-4 (AX-4) మిషన్‌లో భాగంగా ఆయన ఈ ఏడాది జూన్ 8న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) వైపు పయనించనున్నారు. ఈ విషయాన్ని యాక్సియం స్పేస్‌, నాసా కలిసి విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ప్రకటించాయి. మొదటగా ఈ మిషన్‌ను మే 29న నిర్వహించేందుకు షెడ్యూల్‌ చేసినప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది వాయిదా పడింది. దీంతో ప్రయోగాన్ని జూన్‌లోకి ముందుకు జరిపారు.

వివరాలు 

 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వివిధ శాస్త్రీయ పరిశోధనలు 

భారతీయ కాలమానం ప్రకారం జూన్ 8వ తేదీ సాయంత్రం 6.41 గంటలకు (అమెరికా తూర్పు కాలమానం ప్రకారం ఉదయం 9.11 గంటలకు) అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్‌ఎక్స్‌ సంస్థకు చెందిన డ్రాగన్‌ అంతరిక్ష నౌకలో శుభాంశు శుక్లా రోదసిలోకి ప్రయాణం ప్రారంభించనున్నారు. ఈ అంతరిక్ష యాత్రలో ఆయనతో పాటు అమెరికా వ్యక్తి పెగ్గీ విట్సన్‌, పోలండ్‌కు చెందిన స్లావోస్జ్‌ ఉజ్నాన్స్కీ, హంగరీకి చెందిన టిబర్‌ కపు కూడా పాల్గొంటున్నారు. వీరందరూ రెండు వారాల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉంటూ వివిధ శాస్త్రీయ పరిశోధనలను నిర్వహించనున్నారు. ఒక భారతీయ వ్యోమగామి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లడం దాదాపు నలభై ఏళ్ల తర్వాత మొదలవుతోంది.

వివరాలు 

 1984లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన  భారతీయ వ్యోమగామి రాకేశ్ శర్మ 

చివరిసారిగా 1984లో భారతీయ వ్యోమగామి రాకేశ్ శర్మ రష్యా వ్యోమనౌకలో ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన విషయం విదితమే. ఇప్పుడు శుభాంశు శుక్లా ఈ ప్రయాణం చేయనుండగా,ఇది నాసా,భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన ఇస్రో సంయుక్తంగా నిర్వహిస్తున్న మిషన్ కావడం విశేషం. ఈ మిషన్‌లో శుభాంశు శుక్లా మొత్తం ఏడుగురు శాస్త్రీయ ప్రయోగాల్లో పాల్గొననున్నారు.ఆయన చేసే పరిశోధనలలో అంతరిక్షంలో పంటల పెంపకం, అలాగే నీటి ఎలుగుబంటులుగా పిలిచే టార్డిగ్రేడ్‌లపై అధ్యయనం ముఖ్యమైనవి. భారతీయ ఆహారానికి సంబంధించిన పంటలపై ప్రయోగాలు నిర్వహించేందుకు ఇస్రో ప్రత్యేక ప్రణాళికలను రూపొందించింది. ఇందులో మెంతి, పెసల మొలకలపై పరిశీలనలు చేయడం ఉంటుంది. ఈ మొలకలను భూమికి తీసుకురావడంతో పాటు, భూమి మీద అవి ఎలా అభివృద్ధి చెందుతాయన్నదానిపై పరిశీలనలు జరపనున్నారు.