
Dengue Vaccine : భారత పరిశోధనలకు ఫలితం.. స్వదేశీ డెంగ్యూ టీకా మూడో దశ ట్రయల్స్‌లో!
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో డెంగ్యూ వ్యాధి నివారణలో కీలక మలుపుగా నిలవబోయే స్వదేశీ టెట్రావాలెంట్ డెంగ్యూ వ్యాక్సిన్ 'డెంగిఆల్' త్వరలో అందుబాటులోకి రానుంది. అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్(NIH)సహకారంతో భారతీయ బయోటెక్ సంస్థ పనాసియా అభివృద్ధి చేసిన ఈ టీకా ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉంది. ఇది నాలుగు డెంగ్యూ వైరస్ సెరోటైప్స్‌కు వ్యతిరేకంగా రక్షణను కలిగించే లైవ్-అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్‌గా రూపొందించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ ట్రయల్స్‌లో అక్టోబర్ నాటికి 10,500 వాలంటీర్లను నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు పూణే, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, భువనేశ్వర్ వంటి నగరాల్లోని కేంద్రాల్లో 8,000 మందికి పైగా వాలంటీర్లు ఈ క్లినికల్ పరీక్షల్లో పాల్గొనడం విశేషం.
Details
కీలకంగా 'డెంగిఆల్' వ్యాక్సిన్
వీరికి టీకా లేదా ప్లేసిబో ఇవ్వడం జరుగుతోంది. ఈ ప్రయోగాలను పూణేలోని ICMR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్‌లేషనల్ వైరాలజీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ సంయుక్తంగా చేపట్టారు. ప్రస్తుతం భారత్‌లో డెంగ్యూ వ్యతిరేకంగా లైసెన్స్ పొందిన టీకాలు లేవు. ఈ నేపథ్యంలో 'డెంగిఆల్' వ్యాక్సిన్ చాలా కీలకంగా మారింది. డాక్టర్ మనోజ్ ముర్హేకర్ ప్రకారం, ఈ టీకా మొదటి, రెండో దశల్లో భద్రతాపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. మూడో దశ ట్రయల్స్‌లో టీకా పొందినవారిని రెండేళ్ల పాటు గమనించి దీర్ఘకాలిక రోగనిరోధక శక్తిని అంచనా వేయనున్నారు. ఈ మల్టీసెంటర్, డబుల్-బ్లైండ్, రాండమైజ్డ్, ప్లేసిబో-నియంత్రిత ట్రయల్ 2023లో హరియాణాలోని రోహ్‌తక్‌లోని పండిట్ భగవత్ దయాళ్ శర్మPGIMSలో ప్రారంభమైంది.
Details
30వ స్థానంలో ఇండియా
ఈ టెట్రావాలెంట్ స్ట్రెయిన్ (TV003/TV005)అమెరికాలో అభివృద్ధి చేయబడింది. బ్రెజిల్‌లో జరిగిన ట్రయల్స్‌లో ఇది మంచి ఫలితాలను సాధించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పనాసియా బయోటెక్ ఈ స్ట్రెయిన్ ఆధారంగా పూర్తి స్థాయిలో ఫార్ములేషన్‌ను అభివృద్ధి చేసి ప్రాసెస్ పేటెంట్‌ను కూడా పొందింది. డెంగ్యూ వ్యాధి భారత్‌లో ప్రధాన ప్రజారోగ్య సవాలుగా నిలిచింది. WHO ప్రకారం 2023 నాటికి 129 దేశాల్లో డెంగ్యూ వ్యాప్తి ఉన్నట్లు వెల్లడించింది. భారత్ ఈ వ్యాధి ప్రభావిత దేశాల్లో టాప్ 30లో ఉండగా, ఇక్కడ నమోదయ్యే కేసుల్లో 75-80 శాతం వరకు లక్షణాలు లేకుండానే ఉంటాయి.
Details
డెంగ్యూ నియంత్రణకు మార్గదర్శకంగా మారే అవకాశం
అయినా వ్యాధి వ్యాప్తి దోమల ద్వారా జరుగుతూనే ఉంటుంది. 2024లో ఇప్పటివరకు 2.3 లక్షల డెంగ్యూ కేసులు, 297 మరణాలు నమోదవ్వగా, మార్చి వరకు మాత్రమే 12,000కి పైగా కేసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో డెంగిఆల్ వ్యాక్సిన్ దేశంలో డెంగ్యూ నియంత్రణకు మార్గదర్శకంగా మారే అవకాశముంది. ఈ వ్యాక్సిన్ విజయవంతమైతే, స్వదేశీ టెట్రావాలెంట్ డెంగ్యూ టీకాగా చరిత్రలో నిలిచి, భారత ఆరోగ్యరంగాన్ని కొత్త దశలోకి తీసుకెళ్తుందని నిపుణులు ఆశిస్తున్నారు.