Gaganyaan mission: గగనయాన్ మిషన్ వాయిదా.. కారణమిదే!
భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గగనయాన్ మిషన్ 2026కి వాయిదా పడింది. భారత తొలి వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు ఈ మిషన్ ను ప్రారంభించారు. అయితే దీనిని మరో ఏడాది పాటు వాయిదా వేస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ పేర్కొన్నార. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇస్రో స్పష్టం చేసింది. ఈ మిషన్ ప్రాధాన్యాన్ని గుర్తించి, భారత ప్రభుత్వం తాజాగా రూ. 111 బిలియన్లను గగనయాన్ ప్రాజెక్టుకు కేటాయించింది. ప్రాజెక్ట్ చివరి పరీక్షలు, శిక్షణా దశలను ఈ నిధులతో మరింతగా బలోపేతం చేయనుంది. ప్రభుత్వం భారత అంతరిక్ష సామర్థ్యాలను పెంచేందుకు తీసుకుంటున్న దశలను స్పష్టంగా సూచిస్తోంది.
కీలక పరీక్షలను చేపడుతున్న ఇస్రో
ఇస్రో పలు కీలక టెస్టులను ఇప్పటికే మొదలు పెట్టింది. ఇందులో అత్యవసర సహాయ వ్యవస్థలు, రికవరీ సిస్టమ్‌లు ప్రధానంగా ఉన్నాయి. ఈ డిసెంబరులో "జీ1" పేరుతో ఒక అన్ మ్యాన్డ్ టెస్ట్ ఫ్లైట్ నిర్వహించనుంది. ఇందులో వ్యోమమిత్ర అనే హ్యూమానాయిడ్ రోబోని పంపిస్తారు. ఈ టెస్ట్ ద్వారా పునఃప్రవేశం, పారా షూట్ విడుదల, బంగాళాఖాతంలో కంట్రోల్డ్ స్ప్లాష్‌డౌన్ వంటి కీలక అంశాలను పరీక్షించనున్నారు. జీ1 తర్వాత మూడు అదనపు అన్ మ్యాన్డ్ మిషన్ల ద్వారా చివరి దశ పరీక్షలు పూర్తవుతాయి. ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఈ ప్రక్రియకు ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ, బోయింగ్ స్టార్‌లైనర్ మిషన్ ఎదుర్కొన్న సవాళ్లను ప్రస్తావించారు.
ఐఎస్ఎస్ శిక్షణ పొందుతున్న శుక్లా
ఈ మిషన్ కోసం భారత వైమానిక దళం పైలట్ శుభం శుక్లా ఎంపికయ్యాడు. శుక్లా హ్యూస్టన్‌లోని అక్సియం స్పేస్ సంస్థ ద్వారా నాసా మాజీ వ్యోమగామి పెగీ వైట్సన్‌తో కలిసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) మిషన్‌లో శిక్షణ పొందనున్నాడు. భారతదేశం తొలిసారి వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లను చేస్తోంది.