
Meta Threads: 40 కోట్లు దాటిన థ్రెడ్స్ వినియోగదారుల సంఖ్య
ఈ వార్తాకథనం ఏంటి
మెటా కంపెనీకి చెందిన 'థ్రెడ్స్' యాప్ మరో మైలురాయిని అందుకుంది. నెలకు 400 మిలియన్లకుపైగా యాక్టివ్ యూజర్లు ఉన్నట్టు సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ బుధవారం ప్రకటించారు. ఏప్రిల్‌తో పోలిస్తే ఇది 50 మిలియన్ల వృద్ధి. రెండో వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ యాప్ ఇటీవల చేసిన అప్‌డేట్లు, కొత్త ఫీచర్లతో వేగంగా యూజర్లను ఆకట్టుకుంటోంది. గతంలో, ఏప్రిల్ 30న విడుదల చేసిన Q1 2025 ఫలితాల్లో మెటా 350 మిలియన్ యూజర్ల సంఖ్యను వెల్లడించింది. జనవరి చివర్లో ఈ సంఖ్య 320 మిలియన్‌గా ఉంది. ఇదే వేగం కొనసాగితే, 2025లోనే మరో 100 మిలియన్లకుపైగా యూజర్లను చేరుకునే అవకాశం ఉంది. దీంతో 'ఎక్స్' (పూర్వం ట్విట్టర్)తో ఉన్న అంతరాన్ని తగ్గించవచ్చు.
వివరాలు
'ఎక్స్' వదిలి వెళ్లాలనుకునే వారికి ఇది కొత్త ఆప్షన్
'ఎక్స్' ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీ కావడంతో ఖచ్చితమైన యూజర్ల గణాంకాలను బయటపెట్టడం లేదు. అయితే, గత ఏప్రిల్‌లో అప్పుడు సీఈఓగా ఉన్న లిండా యాక్కారినో,ఈ ప్లాట్‌ఫారమ్ వద్ద "దాదాపు 600 మిలియన్" నెలసరి యాక్టివ్ యూజర్లు ఉన్నారని చెప్పింది. జనవరిలో వెల్లడించిన 586 మిలియన్ల కంటే ఇది స్వల్ప వృద్ధి మాత్రమే.ఇటీవల 'థ్రెడ్స్' విజయానికి కొత్త ఫీచర్లే ప్రధాన కారణం. ఇన్‌స్టాగ్రామ్‌కి స్వతంత్రంగా పనిచేసే డైరెక్ట్ మెసేజింగ్ సిస్టమ్,స్పాయిలర్ ట్యాగింగ్,ప్రత్యేక 'ఫెడివర్స్' ఫీడ్, హైలైట్ టూల్ వంటి అప్‌డేట్లు యూజర్లను ఆకర్షించాయి. ఒక్కో ఫీచర్ చిన్నదైనా, ఇవన్నీ కలిసి యాప్‌ను యూజర్ల అభిరుచులకు తగ్గట్టు మార్చినట్టు స్పష్టమవుతోంది. దీంతో 'ఎక్స్' వదిలి వెళ్లాలనుకునే వారికి ఇది కొత్త ఆప్షన్‌గా మారుతోంది.
వివరాలు
'ఎక్స్'కి సవాల్ విసురుతున్న 'థ్రెడ్స్'
ఇక, 'థ్రెడ్స్'లో లీడర్‌షిప్‌లో కూడా మార్పులు వస్తున్నాయి. వచ్చే నెల నుంచి ఎగ్జిక్యూటివ్ కానర్ హేస్, యాప్ డైలీ ఆపరేషన్స్‌ను ఆడమ్ మోసెరీ నుంచి స్వీకరించనున్నారు. అయితే ఆయన మోసెరీకి రిపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఈ మార్పు యాప్ దిశ, యూజర్ వృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. నిరంతర అప్‌డేట్లు, పెరుగుతున్న యూజర్ బేస్‌తో 'థ్రెడ్స్' సామాజిక మాధ్యమాల్లో 'ఎక్స్'కి సవాల్ విసిరే స్థాయికి చేరుకుంటోంది. త్వరలోనే 'ఎక్స్' క్లెయిమ్ చేసిన యూజర్ల సంఖ్యకు మరింత దగ్గర కావచ్చని అంచనా.