Page Loader
NASA: మరోసారి ఆక్సియం మిషన్ 4 వాయిదా.. కొత్త లాంచ్ తేదీపై అప్‌డేట్‌ ఇచ్చిన నాసా 
NASA: మరోసారి ఆక్సియం మిషన్ 4 వాయిదా.. కొత్త లాంచ్ తేదీపై అప్‌డేట్‌ ఇచ్చిన నాసా

NASA: మరోసారి ఆక్సియం మిషన్ 4 వాయిదా.. కొత్త లాంచ్ తేదీపై అప్‌డేట్‌ ఇచ్చిన నాసా 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 18, 2025
10:24 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశానికి చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష ప్రయాణం మరలా వాయిదా పడింది. ఇస్రో (ISRO) ముందు ప్రకటించిన ప్రకారం జూన్ 19న ఆయన యాత్ర మొదలవాల్సి ఉండగా,తాజాగా ఆ తేదీ జూన్ 22కు మారినట్లు సమాచారం. ఇప్పటికే సాంకేతిక కారణాల వల్ల యాక్సియం-4 (Axiom-4) మిషన్ ప్రయోగం అనేకసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ మిషన్‌ కోసం వినియోగిస్తున్న ఫాల్కన్-9 (Falcon-9)రాకెట్‌లో ఈ నెల 11న ప్రయోగించాల్సిన సమయంలో ద్రవ ఆక్సిజన్ లీక్‌ సమస్య తలెత్తింది. దీని కారణంగా ప్రయోగాన్ని వాయిదా వేసారు.ఆ సమస్యను పరిష్కరించిన అనంతరం ఇస్రో మరో ప్రకటనలో జూన్ 19న ప్రయోగం జరుగుతుందని వెల్లడించింది. అయితే ఇప్పుడు ప్రయోగ తేదీని మళ్లీ మార్చినట్లు సంస్థ తెలిపింది.

వివరాలు 

 ఈ యాత్రను యాక్సియం స్పేస్ నిర్వహిస్తోంది

ఇస్రో విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకారం..''ప్రయోగ తేదీపై ఇస్రో బృందం యాక్సియం స్పేస్‌తో కలిసి దీర్ఘకాల చర్చలు నిర్వహించింది.అలాగే ప్రయోగానికి సంసిద్ధత,వాతావరణ పరిస్థితులు,మిషన్ బృంద ఆరోగ్య స్థితి మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకొని యాక్సియం స్పేస్ సంస్థ జూన్ 22ని కొత్త ప్రయోగ తేదీగా నిర్ణయించింది.నాసా,స్పేస్ ఎక్స్ సంస్థలతో కూడా సంప్రదింపులు జరిగాయి,'' అని వివరించింది. ఈయాక్సియం-4 మిషన్‌లో శుభాంశు శుక్లా తో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు భాగస్వాములుగా రోదసిని సందర్శించనున్నారు. అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ అయిన యాక్సియం స్పేస్ ఈ యాత్రను నిర్వహిస్తోంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోతో పాటు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా,ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్‌ఏ కూడా ఈమిషన్‌లో భాగమవుతున్నాయి.

వివరాలు 

28 గంటల ప్రయాణం అనంతరం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి  అనుసంధానం  

ఈ మిషన్‌లో ఉపయోగిస్తున్న స్పేస్ క్యాప్సూల్‌ను ఫాల్కన్-9 రాకెట్ భూమి నుంచి అంతరిక్షంలోకి తీసుకెళుతుంది. ఇందులో శుభాంశు మిషన్ పైలట్‌గా విధులు నిర్వహించనున్నారు. ఈ ప్రయోగం మొదట మే 29న జరగాల్సి ఉండగా, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల వరుసగా వాయిదాలు పడుతున్నాయి. భూమి నుంచి బయలుదేరిన తర్వాత సుమారు 28 గంటల ప్రయాణం అనంతరం వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)తో అనుసంధానమవుతుంది. ఆ తర్వాత శుభాంశు బృందం అక్కడ 14 రోజులపాటు ఉండి, భారరహిత వాతావరణంలో వివిధ ప్రయోగాలను నిర్వహించనున్నారు. అంతేకాకుండా, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పాఠశాల విద్యార్థులు,ఇతరులతో వీడియో ద్వారా సంభాషించే అవకాశం కూడా ఈ బృందానికి కలగనుంది.