అతిపెద్ద 5G నెట్వర్క్ కలిగిన టాప్-3 దేశాల సరసన భారత్.. నోకియా సీఈఓ కీలక ప్రశంసలు
భారతదేశంలోని ఎలక్ట్రానికి సిటీ, ఐటీ మహానగరం బెంగుళూరులో నోకియా తన 6G రీసెర్చ్ ల్యాబ్‌ను ప్రారంభించింది. ఫిన్ లాండ్ టెలికాం కంపెనీ Nokia బెంగళూరులో గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో 6G ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే భారత్ 5G విస్తరణపై నోకియా ప్రెసిడెంట్, సీఈఓ పెకా లుండ్‌బెర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ 5Gని ఇష్టపడుతోందని, ప్రపంచంలోనే 5G యూజర్ బేస్ కలిగిన టాప్ 3 దేశాల్లో భారతదేశం ఒకటని ఆయన ప్రశంసించారు. భారత్ 5G కనెక్టివిటీ విస్తరణ చాలా ఆకట్టుకుందన్నారు. 5G డౌన్‌లోడ్ స్పీడ్ అధునాతన మార్కెట్‌ల్లో కనిపించే వాటి కంటే ఎక్కువగా ఉందని ఆయన వెల్లడించారు.
అత్యంత వేగవంతమైన టెలికాం నెట్‌వర్క్ విస్తరణలో ఇండియా ఒకటి
భారతదేశంలో 5G విజయం, ఇక్కడి సాంకేతికత అభివృద్ధి పురోగతిని నొక్కి చెబుతుందని పెకా లుండ్‌బెర్గ్ అన్నారు. టెలికమ్యూనికేషన్స్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో దేశ నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు. భారత్ లో 5G విస్తరణ నిజంగా గొప్పదని,ఇప్పటివరకు అత్యంత వేగవంతమైన టెలికాం నెట్‌వర్క్ విస్తరణలో ఇండియా ఒకటిని గుర్తు చేశారు. ప్రధాన ప్రాంతాలతో పోల్చితే టెలికాం గేర్ షిప్‌మెంట్‌లో క్షీణత ఉందన్నారు.అయినా భారత్ 5G రోల్ అవుట్ ఫలితంగా ఎరిక్సన్,నోకియా వ్యాపార తగ్గుదలని భర్తీ చేయగలిగిందన్నారు. 2023 జూన్ త్రైమాసికంలో నోకియా 333 శాతం వృద్ధితో రూ. 9,500 కోట్లకు చేరుకోగా, ఎరిక్సన్ సౌత్ ఈస్ట్ ఏషియా, ఓషియానియా, భారత్ కలిపి రూ. 10,700 కోట్ల నికర అమ్మకాలతో 74 శాతం వృద్ధి సాధించిందన్నారు.
90 శాతం వ్యాపారం భారత్ నుంచే వస్తోంది : నోకియా సీఈఓ
ఇందులో సుమారుగా 90 శాతం వ్యాపారం భారత్ నుంచే వస్తుందన్నారు. JM ఫైనాన్షియల్ నివేదిక ప్రకారం, రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ నెట్‌వర్క్‌లను బలోపేతం చేసేందుకు దాదాపుగా రూ.75,000 కోట్ల పెట్టుబడులను సమీకరిస్తున్నాయి. FY24లో జియో రూ. 42,000 కోట్లు, ఎయిర్‌టెల్ రూ. 33,000 కోట్లు పెట్టుబడి పెట్టవచ్చని అంచనా. 5G నెట్‌వర్క్ రోల్-అవుట్ లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత ఇన్వెస్ట్ మెంట్లు తగ్గనున్నాయి. ఈ ల్యాబ్‌ను కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ వర్చువల్‌గా ప్రారంభించారు.అనంతరం భారత్ ను ఇన్నోవేషన్ హబ్‌గా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌లో మరో అడుగు పడినట్టైందన్నారు. టెలికాం శాఖ సహకారంతో భారత్ ఇప్పటికే 6Gపై 200కిపైగా పేటెంట్లను పొందడం గమనార్హం.