
PM Modi: చంద్రునిపై 2040కల్లా భారతీయుడు.. కుజ, శుక్ర గ్రహ యాత్రలూ జరపబోతున్నాం: మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
2040 నాటికి చంద్రుడిపై భారతీయుడు కాలుమోపనున్నాడని, అంతేకాక కుజ గ్రహం (మార్స్), శుక్ర గ్రహం (వీనస్) యాత్రలు కూడా చేపట్టనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం వెల్లడించారు.
ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ అంతరిక్ష అన్వేషణ మహాసభ సందర్భంగా ఆయన పంపిన వీడియో సందేశంలో మాట్లాడుతూ, 2027 నాటికి భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపనున్నట్లు తెలిపారు.
అలాగే, 2035 నాటికి భూమి కక్ష్యలో భారత్‌కు ప్రత్యేక అంతరిక్ష కేంద్రాన్ని నెలకొల్పనున్నామని వివరించారు.
ప్రస్తుతం కక్ష్యలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు మే 29న భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా చేరనున్నారని మోదీ ప్రకటించారు.
వివరాలు
ఒకే లాంచ్‌లో 100ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన ఘనత
ఈ యాత్ర ఇస్రో-నాసా సంయుక్తంగా చేపడుతుండగా, శుభాన్షుతో పాటు ఇతర ముగ్గురు అంతర్జాతీయ వ్యోమగాములు కూడా ISS ప్రయాణించనున్నారని వివరించారు.
1963లో ఒక చిన్నరాకెట్‌తో ప్రారంభమైన భారత అంతరిక్ష ప్రయాణం,చంద్రుని దక్షిణ ధ్రువానికి వ్యోమనౌకను పంపడమే అతిపెద్ద మైలురాయిగా నిలిచిందని ప్రధాని అన్నారు.
చంద్రుడి ఆ ప్రాంతానికి వ్యోమనౌకను పంపిన మొదటి దేశం భారత్‌గానే నిలిచిందని చెప్పారు.
అంతేకాకుండా చంద్రునిపై నీటి ఉనికిని గుర్తించిన ఘనత కూడా భారత్‌దేనని వివరించారు.
అంతేకాక,2014లో తొలిసారి చేసిన ప్రయత్నంలోనే భారత్ కుజ గ్రహాన్ని చేరిన దేశంగా నిలిచిందని చెప్పారు.
అలాగే ఒకే లాంచ్‌లో 100ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన ఘనతను కూడా భారత్ సాధించిందని చెప్పారు.
ఇప్పటివరకు 34దేశాల తరఫున మొత్తం 400ఉపగ్రహాలను ప్రయోగించామని మోదీ వివరించారు.