చంద్రుడి దక్షిణ ధ్రువంపైనే ప్రపంచ దేశాల ఫోకస్.. ఇంతకీ అక్కడ ఏముందో తెలుసా
చందమామపై పరిశోధించే క్రమంలో ప్రపంచ దేశాల అంతరిక్ష సంస్థలు దక్షిణ ధ్రువం(South Pole)పైనే ఫోకస్ పెట్టాయి. అగ్రదేశం అమెరికా సహా ఐరోపా దేశాలు, చైనా, భారత్, జపాన్, ఇజ్రాయెల్ తదితర దేశాలు ఇప్పటికే పలుమార్లు ప్రయోగాలు, పరిశోధనలు చేపట్టాయి. ఎన్ని ప్రయోగాలు చేసినా జాబిల్లిపై ఎన్నో తెలియని విషయలు ఉన్నాయని విజ్ఞాన్ ప్రసార్ శాస్త్రవేత్త డాక్టర్ టీవీ వెంకటేశ్వరన్ పేర్కొన్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువం రహస్యాలకు నిలయమని ఆయన వివరించారు. అక్కడ చేయాల్సిన అన్వేషణ ఎంతో మిగిలి ఉందని తేల్చి చెప్పారు. జాబిల్లిపై ఉండే సౌత్ పోల్ గురించి శాస్త్రవేత్తలకు చాలా తక్కువ విషయాలే తెలుసని, అక్కడ వందల కోట్ల ఏళ్ల క్రితం నాటి 'వాటర్ ఐస్' ఉన్నట్లు అంచనా ఉందని వివరించారు.
వాటర్ ఐస్ దొరికితే ప్రాణవాయువు, ఇంధనాన్ని సమకూర్చుకోవచ్చట
భారత్, దక్షిణ ధ్రువాన్ని ఎందుకు ఎంచుకుందన్న ప్రశ్నపై స్పందించిన శాస్త్రవేత్త వెంకటేశ్వరన్, చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఉన్న వాటర్ ఐస్, మానవసహిత అంతరిక్ష యాత్రలకు ఇంధనంగా భావిస్తున్నారన్నారు. భూమిని దాటి మరో గ్రహాన్ని చేరాలంటే, జాబిల్లిపై ఆగి వెళ్లాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడి 'వాటర్ ఐస్' నుంచి హైడ్రోజన్, ఆక్సిజన్‌ను సైతం విడగొట్టొచ్చని, అది వ్యోమగాములకు ప్రాణవాయువు, ఇంధనాన్ని సమకూరుస్తాయన్నారు. చందమామపై భౌగోళిక పరిస్థితుల వల్లే ధ్రువాల వద్ద పలు ప్రాంతాలు శాశ్వత నీడలో ఉండిపోయాయన్నారు. దీంతో అక్కడ అత్యంత శీతల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయని శాస్త్రవేత్త వెంకటేశ్వరన్ వివరించారు. చంద్రుడిపై వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ కోట్ల ఏళ్లుగా నీరు మంచురూపంలోనే నిల్వ ఉన్నట్లు అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
చంద్రయాన్ 1 ఆ విషయాలనే కచ్చితత్వంతో చెప్పాయి : డాక్టర్ వెంకటేశ్వరన్
దక్షిణ ధ్రువంలో నీరు మంచుగా ఉందని 'లూనార్ మిషన్లు' కచ్చితమైన సమాచారం ఇచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగానే చంద్రయాన్-1 ఆయా డేటాను అందించిందన్నారు. ఈ మేరకే మరిన్ని పరిశోధనల కోసం చంద్రయాన్-3ని చేపట్టారన్నారు. మరోవైపు జాబిల్లి వయసు సుమారుగా 450 కోట్ల ఏళ్లు ఉంటుందన్నారు. భూగ్రహం కన్నా వయసులో చంద్రుడు 6 కోట్ల ఏళ్లు చిన్నవాడని పేర్కొన్నారు. భూమి గురుత్వాకర్షణ కన్నా చంద్రుడి గురుత్వాకర్షణ చాలా తక్కువని,ఈ క్రమంలోనే వస్తువల బరువు భూమిపై కంటే చందమామ వద్ద తక్కువగా ఉంటుందన్నారు. ఉదాహరణ : భూమిపై ఓ వ్యక్తి బరువు 66 కిలోలు ఉంటే, అదే వ్యక్తి బరువు చంద్రుడిపై కేవలం 11 కిలోలు మాత్రమే ఉంటుందన్నారు.