Subrahmanyan Chandrasekhar: నక్షత్రాల జీవిత చరిత్రను వెల్లడించిన శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్.. పుట్టినరోజు స్పెషల్
నక్షత్రాల జీవితచక్రాన్ని వివరించి చెప్పిన శాస్త్రవేత్తలు కొద్దిమందే ఉన్నారు. ఆ గౌరవాన్ని అందుకున్న వారిలో ప్రముఖ శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ ఒకరు. ఆయన జన్మదినం సందర్భంగా, ఆయన చేసిన గొప్ప పరిశోధనలను, విజయాలను మరోసారి గుర్తు చేసుకుందాం. అంతేకాకుండా, ఆయనకు ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సర్ సీవీ రామన్‌తో గల సంబంధాన్ని కూడా తెలుసుకుందాం.
ఖగోళ శాస్త్రానికి సంబంధించి విశేష పరిశోధనలు
నక్షత్రాలపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు కోపర్నికస్, గెలీలియో, కెప్లర్, న్యూటన్ లాంటి మహానుభావులు వేసిన మార్గంలో పయనించి, నోబెల్ బహుమతి అందుకున్న శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ దక్షిణ భారతదేశానికి చెందినవారు. ఆయన 1910 అక్టోబర్ 19న అప్పట్లో అవిభక్త భారతదేశం పంజాబ్ రాష్ట్రంలోని లాహోర్ పట్టణంలో సీతాలక్ష్మి, చంద్రశేఖర సుబ్రహ్మణ్య అయ్యర్ దంపతులకు జన్మించారు. అంతేకాకుండా,సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ తన పాఠశాల, కాలేజీ విద్యలను మద్రాస్ (ఇప్పుడు చెన్నై)లో పూర్తిచేశారు. 1953లో అమెరికా పౌరసత్వం తీసుకోకపోయినా, ఆయనను భారత శాస్త్రవేత్తగా ప్రపంచానికి గర్వంగా చెప్పుకునే వాళ్లం. 19వ ఏట ఉన్నత విద్య కోసం ఇంగ్లాండ్ వెళ్లిన చంద్రశేఖర్ ఖగోళ శాస్త్రానికి సంబంధించి విశేష పరిశోధనలు సాగించారు.
నక్షత్రాలు కూడా మనుషుల్లానే వివిధ దశల ద్వారా పరిణామం చెందుతాయి
1935లో తన పరిశోధనలను లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో ప్రదర్శించి భౌతిక శాస్త్రవేత్తల ప్రశంసలను పొందారు. ఆపై కేంబ్రిడ్జ్ ట్రినిటి కాలేజీ ఫెలోషిప్‌కు ఎన్నికయ్యారు. అందరూ ప్రేమతో "చంద్ర" అని పిలిచేవారు. చంద్రశేఖర్ తన పరిశోధనల్లో నక్షత్రాలు కూడా మనుషుల్లానే వివిధ దశల ద్వారా పరిణామం చెందుతాయని తెలిపారు. ముఖ్యంగా అరుణ మహాతార, శ్వేత కుబ్జ తార, బృహన్నవ్య తార, న్యూట్రాన్ తార, కృష్ణ బిలం వంటి దశలను వివరించారు. ఈ పరిశోధనలకు ఫలితంగా, 1983లో ఆయనకు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. నక్షత్రాల పరిణామంపై ఆయన చేసిన పరిశోధనల్లో, సూర్యుడు కన్నా 1.44రెట్ల ద్రవ్యరాశి ఉన్న నక్షత్రాలు మాత్రమే శ్వేత కుబ్జ తారలుగా మారతాయని తెలిపిన సిద్ధాంతం"చంద్రశేఖర్ లిమిట్"గా ప్రసిద్ధి చెందింది.
సర్ సీవీ రామన్ అన్నకొడుకు సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్
దీనిపై ఆధారపడి, అతిపెద్ద నక్షత్రాలు సూపర్‌నోవా లేదా బ్లాక్ హోల్‌గా మారతాయని ఆయన వివరించారు. ప్రపంచంలో ఒకే కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు నోబెల్ బహుమతి పొందడం అరుదైన విషయం. వారిలో ఒకరు సర్ సీవీ రామన్ కాగా, మరొకరు ఆయన అన్నకొడుకు సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్. 1995 ఆగస్టు 21న అమెరికాలో ఆయన గుండె సంబంధిత వ్యాధితో మరణించారు.