Page Loader
Cosmic 'bones': కాస్మిక్‌ బోన్‌కు పగుళ్లు .. న్యూట్రాన్‌ స్టార్‌ ఢీకొట్టడమే కారణం
కాస్మిక్‌ బోన్‌కు పగుళ్లు .. న్యూట్రాన్‌ స్టార్‌ ఢీకొట్టడమే కారణం

Cosmic 'bones': కాస్మిక్‌ బోన్‌కు పగుళ్లు .. న్యూట్రాన్‌ స్టార్‌ ఢీకొట్టడమే కారణం

వ్రాసిన వారు Sirish Praharaju
May 05, 2025
08:50 am

ఈ వార్తాకథనం ఏంటి

భూమి, ఇతర గ్రహాలు, సూర్యుడు, అలాగే అనేక సంఖ్యలో నక్షత్రాలతో కూడిన మన పాలపుంతలో 'కాస్మిక్‌ బోన్స్‌'అనే అంతరిక్ష ఎముకలు కూడా ఉండటాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా? ఇవి నిలువుగా,పొడవుగా,చాలాసన్నగా ఉండే గట్టి నిర్మాణాలు. ఆకారం దృష్ట్యా వీటిని 'ఎముకలు'గా పిలుస్తుంటారు.వ్యోమగాములకు ఇవి అంతరిక్షంలో ఒక సర్పాన్ని తలపించే ఆకారంలో కనిపిస్తాయి. ఇవికూడా నక్షత్రాల మాదిరిగానే ఉంటాయి. ఈ కాస్మిక్‌ బోన్స్‌ రేడియో తరంగాలను ఉద్గరిస్తుంటాయి. భూమి నుంచి సుమారు 26వేల కాంతి సంవత్సరాల దూరంలో,మన గెలాక్సీ మధ్య ప్రాంతానికి దగ్గరగా ఉన్న జీ359.13 అనే కాస్మిక్‌ బోన్‌ ఇటీవల పగిలిపోయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

వివరాలు 

అద్భుతమైన దృశ్యాలను విడుదల చేసిన నాసా 

ఇది పాలపుంతలో అత్యంత పొడవైన, అత్యంత ప్రకాశవంతమైన కాస్మిక్‌ ఎముకలలో ఒకటి. పల్సర్‌ అనే ఒక న్యూట్రాన్‌ నక్షత్రం గంటకు సుమారు 20లక్షల మైళ్ల వేగంతో దూసుకెళ్లి ఈ ఎముకను ఢీకొట్టడమే ఈ పగుళ్లకు కారణంగా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. చంద్ర ఎక్స్‌-రే అబ్జర్వేటరీతో పాటు వివిధ రేడియో దూరదర్శినుల(టెలిస్కోప్‌ల)సహాయంతో ఈ విషయాన్ని వారు కనుగొన్నారు. ఈ అద్భుతమైన దృశ్యాలను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా విడుదల చేసింది.పెద్ద నక్షత్రాలు పేలిపోతే ఆ పేలుళ్ల అనంతరం న్యూట్రాన్‌ నక్షత్రాలు ఏర్పడతాయి.

వివరాలు 

కాస్మిక్‌ బోన్‌ను ఢీకొన్న పల్సర్‌

ఇవి అత్యంత బలమైన అయస్కాంత శక్తిని కలిగి ఉంటూ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్‌ తరంగాలను విడుదల చేస్తుంటాయి. సెకనుకు కొన్ని వందలసార్లు తమ చుట్టూ తాము తిరుగుతూ అంతరిక్షంలోకి వేగంగా దూసుకెళ్తాయి. ప్రయాణంలో అడ్డుగా ఉన్న వస్తువులను మామూలుగా ఢీకొట్టగలవు. ఇలాగే ఒక కాస్మిక్‌ బోన్‌ను ఢీకొన్న పల్సర్‌ కారణంగానే ఈ గాలాక్టిక్‌ ఎముకలో పగుళ్లు ఏర్పడ్డట్లు శాస్త్రవేత్తలు విశ్లేషించారు.