
#NewsBytesExplainer: భారతదేశం తొలి స్వదేశీ చిప్ 'విక్రమ్-32' విశేషాలు
ఈ వార్తాకథనం ఏంటి
సెమీకాన్ ఇండియా 2025 సందర్భంగా భారతదేశం సెమీకండక్టర్ రంగంలో ఒక పెద్ద మైలురాయిని సాధించింది. ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలిచింది దేశీయంగా రూపొందించిన తొలి చిప్ విక్రమ్-32. ఇది భారత్ అంతరిక్ష పరిశోధనలో స్వయం ఆధారాన్ని పెంపొందించడానికి ఒక ముఖ్యమైన అడుగు. దీన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సెమీకండక్టర్ ల్యాబొరేటరీ,(చండీగఢ్) సంయుక్తంగా రూపకల్పన చేశారు.
వివరాలు
అత్యంత కఠిన పరిస్థితులకూ సిధ్ధం
విక్రమ్-32ను అత్యంత కఠిన వాతావరణ పరిస్థితుల్లో కూడా పనిచేయగల విధంగా తయారు చేశారు. ఇది -55°C నుంచి +125°C వరకు వాతావరణంలో పనిచేయగలదు. సాధారణంగా మనం రోజూ వాడే ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించే చిప్ కాకుండా, ఈ చిప్ ప్రత్యేకంగా అంతరిక్ష పరిశోధనల కోసం రూపకల్పన చేయబడింది. దీన్ని రాకెట్లు, ఉపగ్రహాలు, లాంచ్ వెహికిల్స్ మరియు ఎవియానిక్స్‌లో వాడనున్నారు. ఇది 2009లో వచ్చిన విక్రమ్-16 (Vikram 1601) చిప్‌కు మించిపోయే అప్‌గ్రేడ్‌గా రూపొందించబడింది.
వివరాలు
32 బిట్ ప్రాసెసర్ సామర్థ్యం
విక్రమ్-32 చిప్ లాంచ్ వెహికిల్‌లో నేవిగేషన్, కంట్రోల్, మిషన్ మేనేజ్‌మెంట్, సెకన్ల స్ఫురణలను కొలవడంలో కీలకంగా ఉంటుంది. రాకెట్ నిర్దిష్ట మార్గంలో సరిగ్గా ప్రయాణించడానికి ఈ చిప్ కీలకం. అంతరిక్ష వాతావరణానికి తగిన మిలటరీ-గ్రేడ్ ప్రమాణాల ప్రకారం దీన్ని పరీక్షించారు. ఇది అధిక వేడి, చలి, శక్తివంతమైన ప్రకంపనలు, రేడియేషన్ వంటి పరిస్థితులలో కూడా పనిచేయగల సామర్థ్యం కలిగి ఉంది. 64 బిట్ చిప్ ఏ పనులను చేస్తుందో, విక్రమ్-32 వాటిని పూర్తి స్థాయిలో చేయగలదని చెప్పవచ్చు. 2009లో విక్రమ్-16 బిట్ ప్రాసెసర్ లాంచ్ వెహికిల్స్‌లో ఉపయోగించబడింది.
వివరాలు
అంతరిక్షంలో పరీక్షలు
విక్రమ్-32ను అంతరిక్షంలో విజయవంతంగా పరీక్షించారు. PSLV-C60 ప్రాజెక్ట్‌లో దీన్ని ఉపయోగించి, ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంట్ మాడ్యూల్‌లోని మిషన్ మేనేజ్‌మెంట్ కంప్యూటర్‌లో పనిచేయించారు. అద్భుతమైన ఫలితాలతో పరీక్ష పూర్తయింది,దీనివల్ల ISROలో విశ్వాసం మరింత పెరిగింది. ఈ ఏడాది మార్చి 5న, విక్రమ్-32,కల్పన-32 చిప్స్ ఉత్పత్తి చేసి,ISRO ఛైర్మన్ నారాయణన్ వాటిని ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్‌కు అందజేశారు.
వివరాలు
ఎందుకు వీటికింత ప్రాధాన్యం..?
అంతరిక్ష ప్రయోగాల్లో ఉపయోగించే చిప్స్ సాధారణ మార్కెట్లో అందుబాటులో ఉండవు. ఇవి అత్యంత కఠిన పరిస్థితులను తట్టుకొనేలా వాటిని రూపొందించాలి. ఇప్పటివరకు భారత్ ఇటువంటి చిప్స్ కోసం ఇతర దేశాలపై ఆధారపడింది. విక్రమ్-32తో భారత్ స్వయం సమృద్ధి సాధించింది. ఇది కేంద్రంగా, భారత్‌లో ఆడా కంపైలర్స్, అసెంబ్లర్స్, లింకర్స్, సిమ్యులేటర్ల అభివృద్ధి సులభమవుతోంది. అంతరిక్ష పరికరాలు, హార్డ్‌వేర్, కీలక అప్లికేషన్ల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం చాలా తగ్గింది.