
Trump-Musk: మస్క్-ట్రంప్ విభేదాలు.. భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్ష ప్రయోగంపై నీలినీడలు?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది. వీరిద్దరి మధ్య ఉద్ధృతంగా సాగుతున్న మాటల తూటాలు ప్రస్తుతం అంతరిక్ష రంగానికే ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి. ఈ వాదోపవాదాల నేపథ్యంలో, ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్ సంస్థ 'డ్రాగన్' సేవలను నిలిపివేస్తామని ప్రకటించడం సంచలనం సృష్టించింది. ఆయనకు ప్రభుత్వంతో ఉన్న కాంట్రాక్టులు రద్దు చేస్తే బిలియన్ డాలర్లు మిగులుతాయని ట్రంప్ దీటుగా స్పందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో, భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ప్రణాళికలోని అంతరిక్ష యాత్రపై అనిశ్చితి ముసురుకోవడమే కాదు, ఆందోళనలు కూడా చుట్టుముట్టాయి.
వివరాలు
అంతరిక్ష ప్రయాణంలో, స్పేస్‌ఎక్స్ సంస్థ రూపొందించిన క్రూ డ్రాగన్ నౌక కీలకపాత్ర
జూన్ 10న జరగాల్సిన అంతరిక్ష ప్రయాణంలో, స్పేస్‌ఎక్స్ సంస్థ రూపొందించిన క్రూ డ్రాగన్ నౌక కీలకపాత్ర పోషించనుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వ్యోమగాములను చేర్చే అంశంలో ఈ డ్రాగన్ వాహనం కీలకంగా మారడంతో, ప్రస్తుతం ఏకకాలంలో జరుగుతున్న యాక్సియం-4 మిషన్‌పై ఈ పరిణామాలు ప్రభావం చూపే అవకాశముంది. భారతదేశం,అమెరికా సంయుక్తంగా చేపట్టిన ఈ యాక్సియం-4 మిషన్‌లో నాసా, ఇస్రో, స్పేస్‌ఎక్స్ సంస్థలు భాగస్వామ్యంగా ఉన్నారు. శుక్లాతో పాటు అమెరికా,పోలాండ్, హంగరీ దేశాలకు చెందిన మరి ముగ్గురు వ్యోమగాములు ఈ మిషన్‌లో పాల్గొననున్నారు. వీరంతా స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలోకి వెళ్లనున్నారు.
వివరాలు
దారుణంగా చెడిన ట్రంప్ - మస్క్ మధ్య సంబంధాలు
అయితే, ఈ ప్రయాణాన్ని ఇప్పటికే రెండు సార్లు వాయిదా వేసిన నేపథ్యంలో, తాజా షెడ్యూల్ ప్రకారం భారత కాలమానం మేరకు జూన్ 10 సాయంత్రం 5:52 గంటలకు, అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయాణం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా శుభాంశు శుక్లా మీడియాతో మాట్లాడుతూ, ''భారతీయులు ఈ ప్రయాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించి,భవిష్యత్తుపై ఆశాజనకమైన కలలు కనాలని ఆకాంక్షిస్తున్నాను'' అని తెలిపారు. ఆయన అభిప్రాయాలు దేశవ్యాప్తంగా స్ఫూర్తినిచ్చేలా మారాయి. ఇదిలా ఉండగా,ట్రంప్ - మస్క్ మధ్య సంబంధాలు దారుణంగా చెడింది. మస్క్ మాట్లాడుతూ, తన మద్దతు లేకుండా 2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌తో పాటు రిపబ్లికన్ పార్టీ ఓటమిపాలయ్యేదని వ్యాఖ్యానించారు.
వివరాలు
ప్రభుత్వ ఒప్పందాలన్నీ రద్దు
అంతటితో ఆగకుండా,ట్రంప్‌కు సెక్స్ స్కాండల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జెఫ్రీ ఎప్‌స్టైన్‌తో సంబంధాలు ఉన్నాయని సంచలన ఆరోపణ చేశారు. అంతేకాకుండా ట్రంప్‌ను అభిశంసించాలని కూడా డిమాండ్ చేశారు. ఈవ్యాఖ్యలపై ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు.మస్క్ సంస్థలు కొనసాగిస్తున్న ప్రభుత్వ ఒప్పందాలన్నింటినీ రద్దు చేస్తానంటూ హెచ్చరించారు. దీనిపై మస్క్ తన సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో స్పందిస్తూ,"ప్రభుత్వ ఒప్పందాలను రద్దు చేస్తామన్నట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో,స్పేస్‌ఎక్స్ నేతృత్వంలోనిడ్రాగన్ వ్యోమనౌకను డీకమిషన్ చేసే ప్రక్రియను ప్రారంభిస్తున్నాం" అని పేర్కొన్నారు. అయితే అనంతరం మస్క్ తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గినట్టు కనిపించింది. ఈమొత్తం పరిణామాల మధ్య శుభాంశు శుక్లా అంతరిక్షయాత్ర నిరవధికంగా వాయిదా పడుతుందా? లేక కొత్త మార్గాల ద్వారా మిషన్ కొనసాగుతుందా?అనే అనుమానాలు అంతరిక్ష ప్రియుల్లో కలకలం రేపుతున్నాయి.