పానీపూరీ అమ్మిన కుర్రాడికి భారత జట్టులో స్థానం
బతుకుతెరువు కోసం పానీపూరీ అమ్మిన కుర్రాడు నేడు టీమిండియా జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో తిరుగులేని రికార్డులతో అందరి దృష్టిని ఆకర్షించిన యశస్వీ జైస్వాల్ ఐపీఎల్ లోనూ అద్భుతంగా రాణించాడు. రాజస్థాన్ రాయల్స్ తరుపున ఐపీఎల్‌లో పరుగుల వరద పారించిన జైస్వాల్ కు టీమిండియాలో ఛాన్స్ లభించింది. జాతీయ జట్టుకు జైస్వాల్ ఎంపిక కావడం ఇదే తొలిసారి. వచ్చే నెలలో ఆరంభమయ్యే వెస్టిండీస్ పర్యటన కోసం టీమిండియా వన్డే, టెస్టులను ప్రకటించింది. ఈ క్రమంలో విండీస్ జరిగే తొలి రెండు టెస్టుల కోసం జైస్వాల్ ను ఎంపిక చేశారు. జెస్వాల్ స్కూల్ క్రికెట్లో ఇచ్చిన అద్భుత ప్రదర్శన కారణంగా ముంబై అండర్ 16, ముంబై అండర్ 19 జట్లలో స్థానం సంపాదించుకున్నాడు.
యశస్వీ జైస్వాల్ సాధించిన రికార్డులివే
జైస్వాల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ముంబై తరుపున 26 ఇన్నింగ్స్‌లలో 80.21 సగటుతో 1,845 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది సెంచరీలు, రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇరానీ కప్ లో రెస్ట్ ఆఫ్ ఇండియా తరుపున జైస్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 144 పరుగులు చేశాడు. దీంతో ఇరానీ కప్‌లో మొత్తం 357 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ 14 మ్యాచులు ఆడిన జైస్వాల్ 48.07 సగటుతో 625 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలను బాదాడు. ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై జైస్వాల్ అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. కేవలం 13 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు.