ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్న అంజిక్యా రహానే
టీమిండియా వెటరన్ ఆటగాడు అంజిక్య రహానే మరోసారి ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నాడు. వచ్చే నెలలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్ కు రహానే పయనం కానున్నాడు. కౌంటీ ఛాంపియన్ షిప్ డివిజన్ టూలో లీసెస్టర్ షైర్ క్రికెట్ క్లబ్ కు రహానే ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో రెండు ఇన్నింగ్స్ లలో వరుసగా 89, 46 పరుగులతో రహానే కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఈ ఏడాది జనవరిలోనే లీసెస్టర్ షైర్ క్రికెట్ క్లబ్‌తో రహానే ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.
సెప్టెంబరులో నాలుగు కౌంటీ మ్యాచులు ఆడనున్న రహానే
ఈ ఏడాది జూన్-సెప్టెంబర్ మధ్యలో ఆ జట్టు తరుపున 8 ఫస్ట్ క్లాస్ మ్యాచులు, రాయల్ లండన్ వన్డే కప్‌ను రహానే ఆడాల్సి ఉంది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ ఉండటంతో ఐపీఎల్ ముగిసిన వెంటనే అతను లీసెస్టర్‌షైర్‌తో కలవలేకపోయాడు. అంతకుముందు 2019 కౌంటీ సీజన్‌లో రహానే హాంప్‌షైర్ తరుపున ఆడాడు. ఇప్పటికే టీమిండియా నుంచి ఛతేశ్వర్ పుజారా, పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడుతున్న సంగతి తెలిసిందే. ఆగస్టులో రాయల్ లండన్ వన్డే కప్, సెప్టెంబరులో నాలుగు కౌంటీలు మ్యాచులు రాహానే ఆడే అవకాశముందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.