Abdul Razzaq: ఐశ్వర్యరాయ్‌కి క్షమాపణలు.. ఆ వ్యాఖ్యలు చేయడం తప్పే : అబ్దుల్ రజాక్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్‌పై ఓ టీవీ షోలో పాక్ క్రికెటర్ అబ్దుల్ రజాక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తోటి క్రికెటర్లు, నెటిజన్లు అబ్దుల్ రజాక్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇక అతడితో పాటు ఆ కార్యక్రమానికి హజరైన షాహిద్ అఫ్రిది కూడా చివరికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇక అబ్దుల్ రజాక్ కూడా క్షమాపణలు చెప్పాడు. తన టంగ్ స్లిప్ అయ్యిందని, అలాంటి ఉద్ధేశం తనకు లేదని రజాక్ వెల్లడించారు. ఐశ్వర్యరాయ్‌కు సంబంధించి తన ప్రకటనకు సామా టీవీలో అబ్దుల్ రజాక్ స్పందించాడు.
తన నోటి నుంచి మాట జారిందన్న అబ్దుల్ రజాక్
నిన్న విలేకర్ల సమావేశంలో క్రికెట్, కోచింగ్ గురించి చర్చ జరిగిందని, తన నాలుక జారిందని, తాను ఉదాహరణ చెప్పాలనుకున్నాని అబ్దుల్ రజాక్ పేర్కొన్నారు. అయితే ఐశ్వర్య జీ పేరు తన నోటి నుండి జారిపోయిందని, తాను క్షమాపణ కోరుతున్నానని వెల్లడించారు. మరోవైపు అబ్దుల్ రజాక్ వ్యాఖ్యలను షోయబ్ అక్తర్ ఖండించాడు. స్త్రీలపై ఇలాంటి జోక్, పోలిక సరికాదని చెప్పాడు. ఏ స్త్రీని ఇలా అగౌరవపరచకూడదని, ఆ సమయంలో అబ్దుల్ రజాక్ పక్కన కూర్చున్న వ్యక్తులు నవ్వడం, చప్పట్లు కొట్టడం కూడా తప్పేనని చెప్పాడు.