LOADING...
Asia Cup 2025: కొత్త ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు తర్వాత.. ఆసియా కప్ 2025 టీం ఇండియా మారనుందా?
కొత్త ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు తర్వాత.. ఆసియా కప్ 2025 టీం ఇండియా మారనుందా?

Asia Cup 2025: కొత్త ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు తర్వాత.. ఆసియా కప్ 2025 టీం ఇండియా మారనుందా?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 22, 2025
01:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్ 2025 క్రికెట్ టోర్నమెంట్ ఈ ఏడాదిని సెప్టెంబర్ 9 నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో టీ20 ఫార్మాట్‌లో ప్రారంభం కానుంది. మొత్తం 8 జట్లు ఈ టోర్నమెంట్‌లో పోటీకి సిద్ధమవుతున్నాయి. ఎప్పటిలాగే టైటిల్ కోసం ప్రధాన ఫేవరెట్‌గా భారత్ జట్టే ఉండనుంది. ఈ టోర్నమెంట్‌కు భారత్ జట్టు ఇప్పటికే ఎన్నికైంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, గిల్ వైస్ కెప్టెన్ గా మొత్తం 15 మంది ఆటగాళ్లను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. గత ఆసియా కప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టుతో పోలిస్తే,ఈ సారి జట్టులో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆటగాళ్ల జాబితాలోని మార్పులతో పాటు ఈసారి జట్టుకు సంబంధించిన మరో ప్రధాన తేడా జెర్సీలో కనిపించవచ్చు.

వివరాలు 

గత సారి జెర్సీపై "డ్రీమ్ 11" టైటిల్ స్పాన్సర్ లోగో

గత సారి జెర్సీపై "డ్రీమ్ 11" టైటిల్ స్పాన్సర్ లోగో ఉండగా, ఈ సారి ఆ లోగో ఉండకపోవచ్చని సమాచారం అందుతోంది. భారత జట్టు సెప్టెంబర్ 10న UAEలోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మొదటి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహా ఆటగాళ్లందరూ నీలిరంగు టీ20 జెర్సీలో మైదానంలోకి దిగనున్నారు. జెర్సీపై "India" పేరు, BCCI లోగో, ఆసియా కప్ 2025 లోగో స్పష్టంగా ఉండగా, "డ్రీమ్ 11" లోగో ఉండకపోవచ్చు. గతంలో డ్రీమ్ 11 BCCI టైటిల్ స్పాన్సర్‌గా ఉండటంతో ఆటగాళ్ల జెర్సీ ఛాతి పై పెద్ద అక్షరాల్లో లోగో ఉండేది.

వివరాలు 

 డబ్బు పెట్టి ఆడే ఆన్‌లైన్ గేమ్స్‌పై నిషేధం 

ఈ బిల్లు పార్లమెంట్ ద్వారా ఆమోదం పొందడంతో,త్వరలోనే చట్టబద్ధం అవుతుంది. చట్ట ప్రకారం డబ్బు పెట్టి ఆడే ఆన్‌లైన్ గేమ్స్‌పై నిషేధం అమలు కానుంది. భారత్‌లో ఫాంటసీ గేమ్స్ మార్కెట్‌లో అతి పెద్ద కంపెనీ డ్రీమ్ 11 కావడంతో,దీని వ్యాపారం ఈ చట్టంతో తీవ్రంగా ప్రభావితమవుతుంది. డ్రీమ్ 11 క్రికెట్,ఫుట్‌బాల్,కబడ్డీ వంటి క్రీడల్లో ఫాంటసీ గేమ్స్ నిర్వహిస్తూ గణనీయమైన ఆదాయం పొందింది. ఈ ఆర్జన ఆధారంగా చేసుకుని 2023లో బీసీసీఐతో 358 కోట్ల రూపాయల విలువైన స్పాన్సర్‌షిప్ ఒప్పందం కుదుర్చుకుంది. 2026 వరకు కొనసాగనున్న ఈ ఒప్పందం ప్రకారం, భారత జట్టు జెర్సీ, ట్రైనింగ్ కిట్లపై డ్రీమ్ 11 పేరు పెద్ద అక్షరాల్లో కనిపించేది.

వివరాలు 

కొత్త చట్టం అమలుతో  డ్రీమ్ 11 తన వ్యాపారాన్ని నిలిపివేయాల్సిన పరిస్థితి 

కానీ కొత్త చట్టం అమలు కావడంతో, డ్రీమ్ 11 తన వ్యాపారాన్ని నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి,ఈ కంపెనీ ముందుగానే స్పాన్సర్‌షిప్ ఒప్పందం నుంచి తప్పుకోవచ్చు. బీసీసీఐ కొత్త స్పాన్సర్‌ను త్వరగా వెతకకపోతే, ఆసియా కప్ 2025లో భారత జెర్సీపై ఎలాంటి లోగో లేకుండా ఆటగాళ్లు మైదానంలోకి దిగే అవకాశం ఉంది. ఇలా జరిగితే, బీసీసీఐకి ఆర్థిక నష్టం తప్పదు.ప్రస్తుత ఒప్పంద ప్రకారం,ఒక్కో బైలేటరల్ లేదా ఆసియా కప్ మ్యాచ్‌కి డ్రీమ్ 11 బీసీసీఐకి సుమారు రూ. 6 కోట్లు అందించేది. అయితే,ఐసీసీ టోర్నమెంట్లలో స్పాన్సర్ లోగో ఛాతి మీద కాకుండా చేతి భాగంలో మాత్రమే ఉండటంతో ఆ మొత్తం రూ. 2 కోట్లు గా నిర్ణయించారు.