IND vs AUS : టీమిండియాపై గెలుపొందేందుకు ఆసీస్ సూపర్ స్ట్రాటజీ.. రంగంలోకి కొత్త ఆల్‌రౌండర్
ఈ వార్తాకథనం ఏంటి
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కీలక దశకు చేరుకుంది. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. సెమీఫైనల్స్‌కు భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు క్వాలిఫై అయ్యాయి.
మంగళవారం, బుధవారం సెమీఫైనల్ మ్యాచ్‌లు జరగనుండగా, అత్యంత ప్రాముఖ్యమైన ఫైనల్ మ్యాచ్ ఆదివారం (మార్చి 9న) జరగనుంది.
మంగళవారం జరగనున్న తొలి సెమీఫైనల్‌లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు ఢీకొననున్నాయి.
ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు చేరుకోవడమే కాకుండా, 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఆసీస్ చేతిలో ఎదురైన ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని టీమ్ఇండియా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అదే సమయంలో ఆసీస్ జట్టు విజయం సాధించి తుదిపోరుకు అర్హత సాధించాలని పట్టుదలగా ఉంది.
Details
కూపర్ కొన్నోలీని ఆసీస్ జట్టులోకి చేరే అవకాశం
అయితే ఈ కీలక పోరుకు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మాథ్యూ షార్ట్ దూరమయ్యాడు. అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో తొడ కండరాల గాయంతో బాధపడ్డ అతడిని వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
దీంతో అతడి స్థానంలో ఆల్‌రౌండర్ కూపర్ కొన్నోలీని ఆసీస్ జట్టులో చేర్చింది. ఐసీసీ టెక్నికల్ కమిటీ ఈ మార్పును ఆమోదించింది, తద్వారా కొన్నోలీ సెమీఫైనల్‌లో ఆడే అవకాశం సంపాదించాడు.
కొన్నోలీ ఆల్‌రౌండ్ స్కిల్స్‌తో ఆసీస్‌కు అదనపు బలంగా మారే అవకాశం ఉంది.
ఇటీవల ముగిసిన బిగ్‌బాష్ లీగ్‌లో తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ స్పిన్ ఆల్‌రౌండర్ ఇప్పటివరకు ఆస్ట్రేలియా తరుపున ఆరు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అందులో మూడు వన్డేలు ఉన్నాయి.