AUS vs IND: సీనియర్ల భవిష్యత్తును నిర్ణయించే ఆస్ట్రేలియా సిరీస్: గావస్కర్
భారతదేశం న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను కోల్పోయింది, దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో వెనకబడింది. సిరీస్ ఓటమితో టీమిండియా అగ్రస్థానంలోనుండి రెండవ స్థానానికి పడిపోయింది. ఈనెల మూడవ వారంలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌ను (AUS vs IND) ఆడనుంది. ఇప్పటికే ఓటమి భారంతో ఉన్న భారత జట్టుకు మరొక షాక్ ఇవ్వడానికి ఆసీస్ సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐదు టెస్టుల సిరీస్‌ను భారత్ 4-0తో గెలవడం చాలా కష్టమని పేర్కొన్న సునీల్, సీనియర్ల భవిష్యత్తుపై కూడా స్పందించాడు. ఈ సిరీస్ ముగిసిన తర్వాత వారి భవిష్యత్తు తేలిపోతుందని గావస్కర్ వ్యాఖ్యానించాడు.
స్వదేశంలో కివీస్ చేత పరాజయం
"ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌లో గెలవడం కోసం మాత్రమే దృష్టి సారించాలి.మొదటి సిరీస్‌ను నెగ్గాలి,ఆ తర్వాతే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ గురించి ఆలోచించాలి. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత ఈ విషయాన్ని భారత్ కు సూచించాను.మొన్నటివరకు అత్యంత బలంగా ఉన్న టీమిండియాకు ఇప్పుడు కఠినమైన సవాల్ ఎదురుకానుంది. గత కొన్నేళ్లుగా అదరగొట్టిన సీనియర్లు విరాట్ కోహ్లీ,రోహిత్ శర్మ తాజాగా తమ స్థాయిలో ప్రదర్శన చేయలేదు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాను ఓడించిన భారత్, స్వదేశంలో కివీస్ చేత పరాజయం చవిచూస్తుందని ఎవరూ ఊహించలేదు. ఈ సీనియర్లు భారీగా పరుగులు చేయడంలో విఫలమయ్యారు. అందువల్ల, ఆసీస్‌తో జరిగే టెస్టు సిరీస్ వారి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. స్వదేశంలో స్పిన్నర్లకు ఎదురుగా నిలవడంలో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అశ్విన్‌తో పాటు సుందర్‌కు ఛాన్స్ ఇవ్వాలి: కుంబ్లే
అయితే,ఆస్ట్రేలియాలో పేస్ బౌలింగ్‌ను ఎదురుకోవడం అంత తేలిక కాదు.తమ ప్రతిభను నిరూపించుకుని కొనసాగుతారా లేదా చూడాలి "అని గావస్కర్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌లో తుది జట్టులో కేవలం ఒకరు లేదా ఇద్దరు స్పిన్నర్లకు అవకాశం ఉండొచ్చు. అందులో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు స్థానం ఖాయం.అయితే,అశ్విన్‌తో పాటు వాషింగ్టన్ సుందర్‌కు కూడా అవకాశం ఇవ్వాలని అనిల్ కుంబ్లే సూచించాడు. "అశ్విన్ ఖచ్చితంగా టాప్-5 బౌలర్ల జాబితాలో ఉంటుంది.అయితే, వాషింగ్టన్ సుందర్ గతంలో ఆసీస్ పర్యటనలో మంచి ప్రదర్శన ఇచ్చాడు.కానీ,అశ్విన్‌ను ఆసీస్ బ్యాటర్లు ఇష్టపడరు.ఆయన తమకు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తాడని భావిస్తారు.కాబట్టి,తుది జట్టులో వారిద్దరిలో ఎవరు ఉండాలి అంటే, ఆసీస్ బ్యాటర్లు సుందర్ వైపే మొగ్గు చూపిస్తారు" అని కుంబ్లే వెల్లడించాడు.