మొదటి వన్డేలో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన ఆస్ట్రేలియా మహిళలు
బ్రిస్టల్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో ఇంగ్లండ్ చేతిలో ఆస్ట్రేలియా పరాజయం పాలైంది. ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. అతిథ్య ఇంగ్లండ్ జట్టు 11 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. సెప్టెంబర్ 2021 తర్వాత వన్డేల్లో ఆస్ట్రేలియాకు ఇది మొదటి ఓటమి కావడం విశేషం. ఆస్ట్రేలియా బ్యాటర్లలో బెత్ మూనీ 81 పరుగులు చేయడంతో 263 పరుగులు చేయగలిగింది. ఆమెకు తోడు ఎల్లీస్ పెర్రీ (41), ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (34) కూడా కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇంగ్లండ్ బౌలర్లలో నాట్ స్కివర్-బ్రంట్, లారెన్ బెల్ రెండు వికెట్లతో రాణించారు.
15 వన్డేల తర్వాత ఆస్ట్రేలియా మహిళలకు తొలి ఓటమి
లక్ష్య చేధనలో ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్ 75 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించింది. చివరి వరకు క్రీజులో ఉండి వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు తరలిస్తూ ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపింది. అదే విధంగా ఇంగ్లండ్ ఓపెనర్ టామీ బ్యూమాంట్ (47), అలిస్ క్యాప్సీ 40 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆష్లీ గార్డనర్ 3 వికెట్లతో చెలరేగింది. దాదాపు 15 వన్డేల తర్వాత ఆస్ట్రేలియా మహిళలు ఇంగ్లండ్ చేతిలో ఓడిపోవడం గమనార్హం.