Bangladesh Captain: బంగ్లాదేశ్ కొత్త కెప్టెన్ గా నజ్ముల్ హొస్సేన్ శాంటో
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు ఏడాది పాటు మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా నజ్ముల్ హొస్సేన్ శాంటో నియమితులైనట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సోమవారం తెలిపింది. మూడు ఫార్మాట్లలో శాంటోకు జట్టు పగ్గాలను అప్పగిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(BCB)నిర్ణయం తీసుకుంది. తదుపరి 12 నెలలు బాంగ్లాదేశ్ కెప్టెన్‌గా శాంటో ఉంటాడని బీసీబీ ప్రెసిడెంట్ నజ్ముల్ హసన్ పపోన్ తెలిపారు. ఈ 12 నెలలు శాంటో కెప్టెన్ గా తానేంటో నిరూపించుకుంటే..ఆ తరువాత కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. ఎడమ కంటి రెటీనా సమస్య కారణంగా దృష్టి సమస్యతో బాధపడుతున్న షకీబ్ అల్ హసన్ త్వరలో జరగనున్న శ్రీలంక సిరీస్‌కు షకీబ్ దూరమయ్యాడు. అంతేకాకుండా ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన షకీబ్ రీఎంట్రీపై అనిశ్చతి నెలకొంది.
శాంటో సారథ్యంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ డ్రా
మార్చిలో సొంతగడ్డపై శ్రీలంకతో రెండు టెస్టులు,మూడు వన్డేలు,మూడు ట్వంటీ 20లకు శాంటో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 2023 ప్రపంచకప్‌లో రెండు మ్యాచ్‌లు సహా మూడు ఫార్మాట్లలో 11 మ్యాచ్‌లకు షకీబ్ గైర్హాజరీలో శాంటో గతంలో బంగ్లాదేశ్‌కు నాయకత్వం వహించాడు. అతను గత సంవత్సరం న్యూజిలాండ్‌తో జరిగిన స్వదేశీ,బయటి సిరీస్‌లలో జట్టుకు మార్గనిర్దేశం చేశాడు. బంగ్లాదేశ్ న్యూజిలాండ్‌లో కివీస్‌పై మొదటి ODI,T20 విజయాలను నమోదు చేసింది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అతడి నాయకత్వంలోని బంగ్లా సిరీస్‌ను 1-1తో డ్రాగా ముగించింది. గత ఏడాది అన్ని ఫార్మాట్లలో శాంటో 42.30 సగటుతో 1,650 పరుగులు చేశాడు. అందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక రన్స్ చేసిన బంగ్లాదేశ్ బ్యాటర్ శాంటోనే.