LOADING...
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్ కేంద్ర నిర్ణయంపైనే ఆధారం.. ఆటగాళ్లను ఏమనొద్దు: గావస్కర్
భారత్-పాక్ మ్యాచ్ కేంద్ర నిర్ణయంపైనే ఆధారం.. ఆటగాళ్లను ఏమనొద్దు: గావస్కర్

IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్ కేంద్ర నిర్ణయంపైనే ఆధారం.. ఆటగాళ్లను ఏమనొద్దు: గావస్కర్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 20, 2025
10:42 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్‌ కోసం టీమిండియా తుది జాబితాను ప్రకటించింది. ఇప్పటికే పాకిస్థాన్‌ కూడా తన జట్టును వెల్లడించింది. అయినప్పటికీ, భారత్‌-పాక్ మ్యాచ్‌ జరిగే అవకాశాలపై అభిమానుల్లో ఇంకా అనుమానాలే ఉన్నాయి. ఇటీవల పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌తో క్రికెట్‌ సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో కూడా భారత ఛాంపియన్స్‌ జట్టు పాకిస్థాన్‌తో తలపడలేదు. దీంతో ఆసియా కప్‌లో బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయమై భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్ గవాస్కర్‌ స్పందిస్తూ, ఇలాంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని, ఆటగాళ్లపై ఎలాంటి విమర్శలు చేయకూడదని స్పష్టం చేశాడు.

వివరాలు 

ఆటగాళ్లపై తప్పు మోపకండి: గావస్కర్ 

''భారత్‌-పాక్ మ్యాచ్‌ జరుగుతుందా లేదా అన్నది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం 'ఆడండి' అంటే ఆటగాళ్లు ఆడాల్సిందే. 'ఆడకండి' అంటే బీసీసీఐ కూడా వెనక్కి తగ్గాల్సిందే. ఈ క్రమంలో ప్లేయర్లను ఎవరూ తప్పుపట్టకూడదు. ఎందుకంటే, ఆటగాళ్లు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉంటారు. బీసీసీఐ మాత్రం కేంద్రం ఆదేశాలను పాటిస్తుంది. కాబట్టి ఈ విషయంలో ఆటగాళ్లు ఏమీ చేయలేరు, వారు నిస్సహాయులే. అందువల్ల ప్రభుత్వమే తీసుకునే తుది నిర్ణయాన్ని గౌరవించాలి'' అని గావస్కర్ తెలిపారు.

వివరాలు 

గిల్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలు 

''ఆసియా కప్ కోసం ప్రకటించిన జట్టు చాలా బలంగా ఉంది. బ్యాటింగ్‌లో కుడి - ఎడమ కాంబినేషన్‌తో వైవిధ్యంగా ఉంది. బౌలింగ్ యూనిట్ కూడా సమతూకంగా ఉంది. ఇక శుభమన్ గిల్‌ను వైస్ కెప్టెన్ గా నియమించడం చాలా మంచి నిర్ణయం. ఇటీవలే అతడు 750కి పైగా పరుగులు సాధించాడు. ఇంత మంచి ఫామ్‌లో ఉన్న ఆటగాడిని పక్కన పెట్టలేం. గిల్‌కు ఇప్పుడు వైస్ కెప్టెన్ బాధ్యతలు ఇవ్వడం వెనక పెద్ద ప్రణాళిక ఉంది. భవిష్యత్తులో అతడు టీ20 జట్టుకు కెప్టెన్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి'' అని గావస్కర్ విశ్లేషించారు.