LOADING...
BCCI: బీసీసీఐ అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు, ఎన్నికలు ఉండవు: అరుణ్ ధుమల్ 
బీసీసీఐ అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు, ఎన్నికలు ఉండవు: అరుణ్ ధుమల్

BCCI: బీసీసీఐ అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు, ఎన్నికలు ఉండవు: అరుణ్ ధుమల్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 12, 2025
04:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీసీసీఐ (BCCI) కొత్త అధ్యక్షుడిని ఏకగ్రీవంగా (consensus) ఎన్నుకునే అవకాశం ఉందని ఐపీఎల్‌ (IPL) ఛైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌ తెలిపారు. అసలు షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్‌ 28న బోర్డు ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితులలో ఆ ఎన్నిక జరగడం కష్టమని ఆయన పేర్కొన్నారు. నియమావళి ప్రకారం ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఈసారి అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నిక చేసే అవకాశం ఎక్కువనని ధుమాల్‌ అభిప్రాయపడ్డారు. 'నామినేషన్లు ప్రారంభమైన తర్వాత ఎవరు అధ్యక్ష పదవిని చేపడతారో తెలుస్తుంది. కానీ, ఎన్నికలు జరుగుతాయని మాత్రం నేను అనుకోవడం లేదు. ఏకగ్రీవంగానే అధ్యక్షుడి ఎంపిక జరుగుతుంది' అని అరుణ్‌ ధుమాల్‌ ఓ ఇంటర్వ్యూలో అన్నారు.

వివరాలు 

కొత్త స్పాన్సర్‌ ఎంపికకు సంబంధించి ప్రక్రియ ప్రారంభం 

'బీసీసీఐ.. సభ్యులందర్నీ కూర్చుని నిర్ణయం తీసుకోనివ్వండి. ప్రస్తుతానికి, అందరూ తమ ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఆ జాబితా వెలువడిన తర్వాత, ఎవరు ఏ పదవిలో ఉంటారో మేము చెప్పగలుగుతాం' అని ఆయన పేర్కొన్నారు. అలాగే, ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన తరువాత, డ్రీమ్‌ 11 టీమ్‌ఇండియా స్పాన్సర్‌షిప్‌ నుంచి తప్పుకొంది. బీసీసీఐకు ఇప్పుడు కొత్త స్పాన్సర్‌ వెతకాల్సి ఉంది. "డ్రీమ్‌ 11 తొలగింపు గురించి మార్పు ఇప్పటికే జరిగింది. దానిపై మరోసారి చర్చించాలనేది నా అభిప్రాయం కాదు. కొత్త స్పాన్సర్‌ ఎంపికకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే రెండు మూడు వారాల్లో కొత్త స్పాన్సర్‌ ఎవరు అవుతారో తేలిపోతుంది," అని అరుణ్‌ ధుమాల్‌ వెల్లడించారు.

వివరాలు 

సెప్టెంబర్‌ 28న ఎన్నికలు

ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్‌ బిన్నీ తప్పుకొన్న తర్వాత వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ శుక్లా ఆ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆయన 2020 నుండి బీసీసీఐ వైస్‌ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. బీసీసీఐ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్‌ 28న ఎన్నికలు జరగనుండగా, అదే రోజున ఆసియా కప్‌ (Asia Cup) ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ నేపథ్యంలో టీమిండియా టైటిల్ పోరులోకి ప్రవేశిస్తే, దుబాయ్‌లో బీసీసీఐ నుంచి ప్రతినిధులు ఎవరూ ఉండకపోవచ్చు.