Duleep trophy: బీసీసీఐ కీలక నిర్ణయం.. దులీప్ ట్రోఫీ పాత శైలిలో నిర్వహణ!
టీమిండియా క్రికెట్ లెజెండ్స్‌తో ఈ ఏడాది అద్భుతంగా సాగిన దులీప్ ట్రోఫీ, వచ్చే ఏడాది నుండి పాత శైలిలో నిర్వహించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సారి నాలుగు జట్లతో, అంటే భారత్-ఎ, బి, సి, డి మధ్య టోర్నీ జరిగింది. అయితే రాష్ట్ర క్రికెట్ సంఘాలు ఈ కొత్త విధానానికి వ్యతిరేకంగా నిలిచాయి. బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) రాష్ట్ర క్రికెట్ సంఘాలు తమ ఆటగాళ్లకు తక్కువ అవకాశాల వచ్చాయని అసంతృప్తిని వ్యక్తం చేశాయి. దీంతో వచ్చే ఏడాది నుండి దులీప్ ట్రోఫీని సెంట్రల్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, నార్త్‌ఈస్ట్ జోన్ల మధ్య నిర్వహించే అవకాశముంది.
టీమ్‌ఇండియా స్టార్ క్రికెటర్లతో కొత్తగా కళకళలాడిన దులీప్ ట్రోఫీ
ఈ సీజన్‌లో కొత్త ఫార్మాట్ కారణంగా తమ ఆటగాళ్లకు అవకాశాలు రాలేదని ఒక రాష్ట్ర సంఘం ప్రతినిధి తెలిపారు. యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, ఆకాశ్ దీప్, కుల్‌దీప్ యాదవ్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, శుభ్‌మన్ గిల్ వంటి క్రీడాకారులు ఈ టోర్నీలో ఆడడంతో, దులీప్ ట్రోఫీకి ప్రత్యేక ఆకర్షణ కలిగింది. ఈ సమావేశంలో బీసీసీఐ కొత్త కార్యదర్శి నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని సభ్యులు కోరారు. ప్రస్తుతానికి దిల్లీ అండ్ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు రోహన్ జైట్లీ, బీసీసీఐ కోశాధికారి ఆశిష్ షెలార్, సంయుక్త కార్యదర్శి దేవజిత్ సైకియా, గుజరాత్ క్రికెట్ సంఘం కార్యదర్శి అనిల్ పటేల్ కొత్త కార్యదర్శి రేసులో ఉన్నారు.