Page Loader
Rohit Sharma: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌ కోసం రోహిత్ శర్మనే కెప్టెన్‌!
బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌ కోసం రోహిత్ శర్మనే కెప్టెన్‌!

Rohit Sharma: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌ కోసం రోహిత్ శర్మనే కెప్టెన్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 27, 2025
12:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత టెస్టు జట్టులో రోహిత్ శర్మ కొనసాగింపుపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నా ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు అతనే కెప్టెన్‌గా కొనసాగనున్నట్లు బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. 37 ఏళ్ల రోహిత్ శర్మ ఈ కీలక సిరీస్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. 2007 తర్వాత ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలనే లక్ష్యంతో భారత జట్టు సిద్ధమవుతోంది. భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జూన్ 20న హెడింగ్లీలో ప్రారంభం కానుంది.

Details

ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ వైఫల్యం 

ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అతని ప్రదర్శన ఘోరంగా విఫలమై, చివరి టెస్టు నుంచి తప్పుకున్నాడు. అయితే అతని నాయకత్వంలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడంతో, ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు అతడే కెప్టెన్‌గా కొనసాగాలని సెలెక్టర్లు భావించినట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లను కోల్పోయినా బీసీసీఐ రోహిత్‌పై నమ్మకాన్ని చూపుతోంది.

Details

 రోహిత్ కెప్టెన్సీలో వరుస ఓటములు 

న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత, ఆస్ట్రేలియా పర్యటనలోనూ రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు పరాజయం పాలైంది. అయినా అతడే ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో భారత జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఐపీఎల్ 2025 ముగింపు దశలో ఉన్నప్పుడే ఇంగ్లండ్ పర్యటనకు జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించే అవకాశం ఉంది. ఇంగ్లండ్ సిరీస్‌కు ఇంకా సమయం ఉండటంతో, అందుబాటులో ఉన్న ఆటగాళ్లపై స్పష్టత రానుంది.

Details

 టెస్టుల్లో రోహిత్ దారుణ ప్రదర్శన 

2024 సెప్టెంబర్ నుంచి 2025 జనవరి మధ్య జరిగిన 10 టెస్టు మ్యాచ్‌లలో రోహిత్ కేవలం 164 పరుగులు మాత్రమే చేశాడు. ఆసీస్ పర్యటనలో అతని ప్రదర్శన మరింత నిరాశపరిచేలా మారింది. 6.2 సగటుతో కేవలం 31 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ క్రమంలో, అతని టెస్టు కెరీర్‌పై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Details

బుమ్రా ఫిట్‌నెస్‌పై ప్రశ్నార్థకం 

భారత ప్రధాన బౌలర్ జస్పిత్ బుమ్రా ఫిట్‌నెస్ విషయంలో బీసీసీఐ ప్రత్యేక దృష్టి పెట్టనుంది. ఆస్ట్రేలియా పర్యటనలో వెన్ను గాయం కారణంగా అతడు పూర్తిగా కోలుకోలేదని నివేదికలు పేర్కొంటున్నాయి. ఐపీఎల్ 2025లోని తొలి మ్యాచ్‌లకు బుమ్రా ముంబై ఇండియన్స్ తరఫున అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

Details

 45 రోజుల పాటు ఇంగ్లండ్ పర్యటన 

ఇంగ్లండ్ టెస్టు సిరీస్ కోసం టీమిండియా మొత్తం 45 రోజుల పాటు ఆ దేశంలో పర్యటించనుంది. జూన్ 20న హెడింగ్లీలో తొలి టెస్టు ప్రారంభం కానుంది. అంతకు ముందు మే 30న కాంటెర్బరీలో సెయింట్ లారెన్స్ గ్రౌండ్‌లో నాలుగు రోజుల మ్యాచ్ జరగనుంది. అలాగే, జూన్ 6న నార్తాంప్టన్‌లో మరో ప్రాక్టీస్ మ్యాచ్‌ షెడ్యూల్‌లో ఉంది. ఈ నేపథ్యంలో, రోహిత్ శర్మకు ఇంగ్లండ్ టెస్టు సిరీస్ ఎంతో కీలకం కానుంది. అతని ఫామ్, నాయకత్వ నైపుణ్యం భారత్ విజయావకాశాలను ప్రభావితం చేయనున్నాయి.