Page Loader
Team India: భవిష్యత్తులో పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం సాధ్యపడదు: రాజీవ్ శుక్లా 
భవిష్యత్తులో పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం సాధ్యపడదు: రాజీవ్ శుక్లా

Team India: భవిష్యత్తులో పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం సాధ్యపడదు: రాజీవ్ శుక్లా 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 24, 2025
01:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాం ఉగ్రదాడి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదనను కలిగించిన నేపథ్యంలో, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌తో భవిష్యత్తులో ఎటువంటి ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు జరగవని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తేల్చిచెప్పారు. 2012-13 సీజన్ తర్వాత నుంచి భారత జట్టు పాక్ మైదానాల్లో అడుగుపెట్టిన సందర్భం లేదు. ప్రస్తుతం కూడా కేవలం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహించే టోర్నీల్లో మాత్రమే తటస్థ వేదికలపై పాకిస్థాన్‌తో తలపడుతోంది. ఈ నేపథ్యంలో, ఐసీసీ ఈ వ్యవహారంపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని రాజీవ్ శుక్లా సూచించారు.

వివరాలు 

దేశంలో ఏర్పడిన పరిస్థితులపై ఐసీసీకి స్పష్టమైన అవగాహన ఉంది 

"పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మా సంఘీభావం తెలుపుతున్నాం. ఈ దాడిని బీసీసీఐ తీవ్రంగా ఖండిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం మేము ముందుకు సాగుతాము. ఇప్పటికే పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు. ఇకపై కూడా అలాంటి అవకాశం ఉండదు. కానీ ఐసీసీ టోర్నీల్లో పాల్గొనడం అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం జరుగుతోంది. ప్రస్తుతం దేశంలో ఏర్పడిన పరిస్థితులపై ఐసీసీకి స్పష్టమైన అవగాహన ఉందని ఆశిస్తున్నాను," అని ఆయన వివరించారు.

వివరాలు 

పహల్గాం ఘటనపై బీసీసీఐ సంతాపం 

ఈ దారుణమైన ఘటనపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తీవ్రంగా ఖండించారు. ఐపీఎల్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా బోర్డు సంతాపాన్ని ప్రకటించింది. ఆ మ్యాచ్‌ను ఎలాంటి సంబరాలు లేకుండా నిరాడంబరంగా నిర్వహించారు. "ఉగ్రదాడిలో అమాయకుల ప్రాణాలు పోవడం ఎంతో బాధాకరం. బాధిత కుటుంబాలకు మేము అండగా నిలుస్తాం. ఈ దారుణ ఘటనపై తెలిసిన వెంటనే క్రికెట్ ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతికి లోనైంది. బీసీసీఐ తరఫున మేము ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఐక్యంగా స్పందించి, సంఘటితంగా ముందుకెళ్లాలి," అని దేవజిత్ పేర్కొన్నారు.