Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి ప్రమాదం.. బీసీసీఐ వర్గాలు ఏమన్నాయంటే?
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ లీగ్ స్టేజ్‌లోనే నిలిచిపోయింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ చేతుల్లో ఓడిన టీమిండియా, సెమీస్‌కు చేరకుండానే టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీ చేసినా, జట్టుకు విజయం దక్కలేదు. ఆఖర్లో నిదానంగా ఆడటమే ఓటమికి కారణమంటూ సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు, ఆమె కెప్టెన్సీ పై సమస్యలు తలెత్తుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ వర్గాలు ఈ రూమర్లపై స్పందిస్తూ, త్వరలోనే ప్రధాన కోచ్ అమోల్ ముజుందార్, సెలక్షన్ కమిటీతో సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నాయి. హర్మన్‌ను కొనసాగించాలా, వద్దా అన్నది ఈ సమావేశంలో తేలనుంది.
హర్మన్‌ను కొనసాగించాలా అన్నది ఇప్పుడే నిర్ణయించలేం
ఒక బీసీసీఐ వర్గం ఈ విషయం పై మాట్లాడుతూ, ''టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రదర్శన ఆశించినంతంతగానిది కాదు. హర్మన్ నాయకత్వంపై కూడా అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్త కెప్టెన్‌ను నియమించాలా, హర్మన్‌ను కొనసాగించాలా అన్నది ఇప్పుడే నిర్ణయించలేం. జట్టుకు కొత్త నాయకత్వం అవసరమైతే, బీసీసీఐ ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటుంది. హర్మన్ ఇప్పటికీ జట్టులో కీలక సభ్యురాలే అయినప్పటికీ, మార్పులు చేయాల్సిన సమయం వచ్చిందని బోర్డు భావిస్తోంది'' అని పేర్కొంది.
రేసులో స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్
హర్మన్ ప్రీత్ కౌర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే, జట్టుకు ఎవరు నాయకత్వం వహించనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ ఈ రేసులో ముందున్నారు. స్మృతి ప్రస్తుతం వైస్ కెప్టెన్‌గా ఉండగా, 24 ఏళ్ల రోడ్రిగ్స్ మిడిల్ ఆర్డర్‌లో చురుకైన బ్యాటర్. అయితే, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ జెమీమాకే కెప్టెన్సీ అప్పగించడం మంచిదని అభిప్రాయపడింది.